వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు పూర్తి చేసుకుంది. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం పైనే దృష్టి పెట్టారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఎన్నికల ప్రచార సమయంలోనే... తమ పార్టీ మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని ప్రకటించిన వైఎస్ జగన్... చెప్పినట్లుగానే... అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే దాదాపు 90 శాతం హామీలు అమలు చేసి అందరితో శభాష్ అనిపించుకున్నారు. చెప్పిన హామీల కంటే ఎక్కువే అమలు చేశామంటున్నారు వైసీపీ నేతలు. అటు జగన్ కూడా... పరిపాలనపైనే ఈ రెండున్నర ఏళ్ల పాటు ఎక్కువగా దృష్టి పెట్టారు. పార్టీ కార్యకలాపాలను కొంత నిర్లక్ష్యం చేసినట్లుగానే తెలుస్తోంది. పథకాల అమలు ఓ గాడిలో పడిన తర్వాత... ఇక ఇప్పుడు పార్టీపై ప్రత్యేక దృష్టి సారించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్.

అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే మంత్రివర్గ మార్పు రెండున్నర ఏళ్ల తర్వాత ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. మరో నెల రోజుల్లో కొత్త మంత్రులు కొలువు తీరనున్నారు. ఇదే సమయంలో పార్టీలో ఇప్పటి వరకు అధికారం అనుభవించిన నేతలను పార్టీ కోసం వినియోగించుకునేందుకు జగన్  ప్లాన్ చేస్తున్నారు. కొత్త వారికి మంత్రి పదవులు ఇస్తూనే... ఇప్పటి వరకు ఉన్న వారికి ఎలక్షన్ 2024 టార్గెట్ నిర్ణయించారు. అలాగే పార్టీ కోసం పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. అందులో భాగంగానే మల్లాది విష్ణును బ్రాహ్మణ కార్పొరేషన్ పదవి నుంచి తప్పించారు. జక్కంపూడి రాజాను కాపు కార్పోరేషన్ ఛైర్మన్ పదవి నుంచి తొలగించారు వైఎస్ జగన్. నగరి ఎమ్మెల్యే రోజాను కూడా ఏపీఐఐసీ కార్పోరేషన్ పదవి నుంచి తప్పించారు. కేబినెట్ తప్పించే మంత్రులను కూడా పార్టీ బాధ్యతలు అప్పగించనున్నారు వైఎస్ జగన్. 2024 ఎన్నికలకు కొత్త మంత్రులతో టీమ్ ఏర్పాటు చేయనున్నారు. అలాగే పార్టీలో ఓ కమిటీ కూడా ఏర్పాటు చేసి... పాత, కొత్త మంత్రులను అందులో సభ్యులుగా చేర్చనున్నారు. పార్టీ, ప్రభుత్వ వాయిస్ బలంగా వినిపించే వారికే తాజా మంత్రివర్గంలో చోటు దక్కుతుందని అంతా భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: