ఎన్ని విజయాలు ఉంటేనేమి. ఏపీ అంతా తన గుప్పిట ఉంటేనేమి వైసీపీలో మాత్రం జోష్ లేదు. నిజానికి ఇపుడు ఏపీ అంతా వైసీపీమయంగానే ఉంది. పంచాయతీ వార్డు మెంబర్ తో మొదలుపెడితే పార్లమెంట్ సభ్యుడి దాకా ఆ పార్టీ వారే రాజ్యలేలుతున్నారు.

మాకు 68 శాతం ఓట్ల షేర్ ఉంది అని జబ్బలు చరుస్తున్నవైసీపీ లోలోపల మాత్రం వణుకుతోంది. ఆ వణుకే ఇపుడు విపక్షాలు ఆయుధంగా మారుతోంది. ఇంత పెద్ద విజయం సొంతం చేసుకున్నాక వైసీపీలో ఎందుకు ఇంత గుబులు ఏర్పడింది అన్నది చర్చగా ఉంది. దానికి కారణం ఆచంట. అది ఏపీ మంత్రి రంగనాధరాజు సొంత నియోజకవర్గ కేంద్రంలో ఉంది. అలాంటి చోట టీడీపీ గెలిచింది. అది కూడా జనసేన మద్దతు తీసుకుని మరీ విజయం సాధించింది. ఈ విజయమే ఇపుడు వైసీపీని స్థిరంగా ఉండనీయడంలేదు.

ఆచంట ఎంపీపీ సీటు పోతేనేమి 621 చోట్ల వైసీపీకి ఎంపీపీ కుర్చీలు దక్కాయి కదా. పైగా టీడీపీ గెలిచినవి సొంతంగా అయిదు ఎంపీపీలే కదా. అలాగే టోటల్ గా విపక్షాలు అన్నీ కలసి గెలిచినవి 11 ఎంపీపీలే కదా. అయినా ఎందుకు ఇంత దిగులు అంటే అక్కడే ఉంది మ్యాజిక్ అంటున్నారు. అక్కడ కలసింది జనసేన టీడీపీ. ఈ రెండు పార్టీలు కలిస్తే కనుక కచ్చితంగా వైసీపీని ఢీ కొట్టే పరిషితి వస్తుంది. దీని మీద అపుడే టీడీపీ తమ్ముళ్ళు ప్రచారం మొదలెట్టేశారు.

రెండు పార్టీలు కలిస్తే సంచలన విజయాలే నమోదు అవుతాయని కూడా చెప్పుకొచ్చారు. దాంతో ఇపుడు వైసీపీకి షాక్ తగిలినట్లుగా ఉంది. ఆచంట తో ఈ బంధం ఆగేది కాదు, ఆ జంట మరింతగా సాగి ఏకంగా అసెంబ్లీ రూట్ వైపే దూసుకుపోతే కనుక వైసీపీకి మళ్లీ 2014 నాటి రోజులు గుర్తుకు వచ్చి తీరుతాయి అంటున్నారు. దాంతో ఇపుడు వైసీపీలో ధీమా సడలుతోందిట. మరి రాజకీయ పార్టీలు అన్న తరువాత ఇలాంటి ఎత్తులు పొత్తులే ఉంటాయి. వీటి విరుగుడుగా వైసీపీ కూడా వ్యూహాలు కొత్తగా రూపొందించుకోవాల్సిందే మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: