స్నేహపూర్వకంగా మెలుగుతూ ప్రజలకు దగ్గరవుతా.. వారి సమస్యలకు పరిష్కారాన్ని చూపుతా ఇదీ.. సిద్ధార్థ కౌశల్ చెప్పిన మాట. ఇచ్చిన మాట ప్రకారమే చేస్తున్నారు ఈ పోలీస్. అసలు ఈ సార్ ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారనే కదా మీ డౌట్. అసలు విషయానికొస్తే... ఈ నాలుగో సింహం కృష్ణా జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తన ఛాంబర్ టేబుల్ పై తన పేరు కాకుండా.. దయచేసి కూర్చోండి అని బోర్డు పెట్టారు. స్పందన కార్యక్రమంలో భాగంగా ఎవరు ఫిర్యాదు చేసేందుకు వచ్చినా.. ఓపికగా వింటున్నారు. గౌరవంగా మాట్లాడుతున్నారు. పోలీసు శాఖ ఎల్లప్పుడూ బాధితులకు అండగా ఉంటుందన్నారు ఈ ఎస్పీ.

సిద్ధార్థ్ కౌశర్ పేరు.. ఇపుడు ఏపీ వ్యాప్తంగా మారు మోగిపోతోంది. ఎందుకంటే ఆయన పనితనం అంత బాగుంటుంది. తాను కృష్ణా జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజుల్లోనే బుల్లెట్ పై ప్రజల్లోకి వెళ్లారు. వారి సమస్యలను జాగ్రత్తగా విన్నారు. అంతేకాదు మచిలీపట్నంలో కలియతిరిగి ట్రాఫిక్ సమస్యలపై దృష్టి సారించారు. ఎక్కువగా యాక్సిడెంట్ లు జరిగే ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ కనుబరుస్తున్నారు. ప్రజాసమస్యలు సచివాలయాల దగ్గరే నెరవేరేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాదు పోలీసులు సైతం ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు కౌశల్. వేధింపులకు గురయ్యే మహిళలు తమ దగ్గరకు ధైర్యంగా వచ్చి చెప్పుకునేలా ఫ్రెండ్లీ వాతావరణం కల్పించాలన్నారు.

పోలీస్ సమాజానికి సిద్ధార్థ్ కౌశల్ ఆదర్శంగా నిలుస్తున్నారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే వారి పట్ల పోలీసులు మర్యాదతో వ్యవహరించాలని సూచిస్తున్నారు. ఇలాంటి వ్యవహారాల్లో ఎలాంటి కంప్లైంట్స్ వచ్చినా సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చి దిశ యాప్ పై మహిళలకు అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. పలుచోట్ల క్యాంప్ లు ఏర్పాటు చేసి మహిళల్లో భరోసా నింపుతున్నారు.

మొత్తానికి కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ రియల్ హీరో అనిపించుకుంటున్నారు.








మరింత సమాచారం తెలుసుకోండి: