హుజురాబాద్ ఉప ఎన్నిక పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి అగ్ని పరీక్షలా మారింది. కౌశిక్ రెడ్డి రాజీనామాతో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థే కరువయ్యారు. అయితే బలమైన అభ్యర్థి కోసం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. మాజీ మంత్రి కొండా సురేఖను నిలబెట్టాలని చూశారు. దానికి అనుగుణంగానే ముందుగా దామోదర్ రాజనర్సింహ కమిటీ రిపోర్ట్ ముగ్గురి పేర్లను ప్రతిపాదించింది. అందులో కొండా సురేఖ పేరుంది. కానీ పార్టీలో అంతర్గతంగా విభేదాలు, టికెట్ కోసం లోకల్ లీడర్ల పట్టుతో సీన్ మారింది. పీసీసీ ఆశావహుల నుండి దరఖాస్తులను సేకరించింది. కానీ కొండా సురేఖ మాత్రం హుజురాబాద్ టికెట్ కోసం దరఖాస్తు పెట్టుకోలేదు.

హుజురాబాద్ బరిలో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌, బీజేపీలను ఢీ కొట్టాలంటే కొండానే కావాలనుకుంటున్నారు హస్తం నేతలు. అయితే కొండా దంపతులు మాత్రం.. హుజురాబాద్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే కొన్ని షరతులు పెట్టారు. 2023 ఎన్నికల్లో తమ కుటుంబానికి హుజురాబాద్‌తోపాటు వరంగల్ తూర్పు, పరకాల టిక్కెట్లు ఇవ్వాలని కొండెక్కి కూర్చున్నారు. తమ డిమాండ్స్‌కి ఒకే అంటే సమరానికి సై అంటామని తేల్చి చెబుతున్నారు. అయితే ఇప్పుడు కొండెక్కి కూర్చున్న కొండా దంపతులను బుజ్జగించే పనిలో పడింది పీసీసీ. ముందుగా హుజురాబాద్‌లో కొండా తప్పా మరెవరు పోటీ చేసిన వర్కవుట్ కాదని భావిస్తుంది. ఇప్పటికే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీతో పాటు మరో ఇద్దరు నేతలు జూబ్లీహిల్స్‌లోని కొండా నివాసానికి వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. 2023 టిక్కెట్ల విషయాన్ని.. ఆ సమయంలో చర్చించుకుందామని హామీ ఇచ్చినట్లు టాక్. అంతేకాదు ఎన్నికల ఖర్చు కూడా తామే భరిస్తామని కూడా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక 2023 ఎన్నికల్లో కొండా దంపతులకు టిక్కెట్ల కేటాయింపు విషయంలో ఏఐసీసీ నిర్ణయమే అంతిమం అని చెప్పినట్లు సమాచారం.

మొత్తానికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి హుజురాబాద్ ఉప ఎన్నిక సవాలుగా మారింది. అయితే ముందుగా అభ్యర్థి ఎంపికలోనే హస్తంపార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. మరి బలమైన అభ్యర్థి అని కొండా సురేఖ వైపు చూస్తే.. కొండా సురేఖ ఈజీగా నిలబడే పరిస్థితి లేదు. అలాగని లోకల్ లీడర్లకు అవకాశం ఇద్దామంటే.. డిపాజిట్లు కూడా రావనే భయం నేతలను వెంటాడుతోంది. మరి చివరికి కాంగ్రెస్ పార్టీ ఎవరిని బరిలో పెడుతుందా? అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే కాంగ్రెస్‌ హైకమాండ్‌ కొండా దంపతుల డిమాండ్‌కు ఒప్పుకుంటుందా? ఒకవేళ అదే జరిగితే.. 2023 ఎన్నికల్లో కొండా దంపతులు వరంగల్‌ తూర్పు, పరకాల స్థానాల్లో నెగ్గుకు రాగలరా? అనేది కాలమే తేల్చాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: