తిరుమలకు వచ్చే భక్తులలో అధిక శాతం మంది సర్వదర్శనం ద్వారానే శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా కారణంగా గత ఏడాదిన్నర కాలంలో తిరుమల కొండపై పరిస్థితులన్నీ పూర్తిగా మారిపోయాయి. టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. కరోనా ఎఫెక్ట్‌తో దాదాపు 80 రోజుల పాటు శ్రీవారి దర్శనానికి భక్తులను నిలిపివేసింది టీటీడీ. అటు తర్వాత శ్రీవారి ఆలయంలో దర్శనాలపై నియంత్రణను ప్రారంభించింది. ప్రస్తుతం కొవిడ్ ఆంక్షలను అనుసరిస్తూ పరిమిత సంఖ్యలోనే భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తోంది. ఈ ఏడాదిన్నర కాలంలో మధ్య మధ్యలో సర్వదర్శనానికి కొద్దిరోజుల పాటు భక్తులను అనుమతించిన టీటీడీ.. కొవిడ్ వ్యాప్తి నివారణలో భాగమంటూ ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో సర్వదర్శనాలను టీటీడీ పూర్తిగా రద్దు చేసింది. కేవలం ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి ట్రస్ట్‌, వీఐపీ బ్రేక్‌, వర్చువల్ ఆర్జిత సేవా టిక్కెట్లు కలిగిన భక్తులకు... అంటే పెయిడ్ దర్శనాలకు మాత్రమే భక్తులను అనుమతించింది. సర్వదర్శనం ద్వారా భక్తులను అనుమతించాలంటూ భక్తుల నుంచి టీటీడీకి ఎన్ని విఙ్ఞప్తులు వచ్చినా టీటీడీ యాజమాన్యం లెక్క చేయలేదు. ప్రస్తుత పరిస్థితులలో సర్వదర్శనం ద్వారా భక్తులను అనుమతించలేమని ఖరాకండిగా చెప్పేసింది. దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టి విద్యాసంస్థలు తెరుచుకున్నాయి. అలాగే సినిమా హాల్స్, మాల్స్ ప్రారంభమయ్యాయి. దేశ వ్యాప్తంగా జన జీవనం సాధారణ స్ధితికి చేరుకున్నా... శ్రీవారి ఆలయంలో సర్వదర్శనాన్ని మాత్రం టీటీడీ ప్రారంభించ లేదు.

అయితే సర్వదర్శనాన్ని ప్రారంభించాలంటూ టీటీడీపై భక్తుల నుంచి ఒత్తిడి పెరిగింది. ఈ తరుణంలోనే రెండోసారి టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన వైవీ సుబ్బారెడ్డి... స్వరూపానంద ఆశీస్సులు తీసుకునేందుకు రుషికేష్‌లో చాతుర్మాస దీక్షలో ఉన్న ఆయన దగ్గరకు వెళ్లారు. ఈ సందర్భంగా స్వరూపానంద టీటీడీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారట. వెంటనే సామాన్య భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పించేలా సర్వదర్శనం ప్రారంభించాలని ఛైర్మన్‌ను ఆదేశించారట. రాజగురువు ఆదేశించడమే తరువాయి అన్నట్లు స్వరూపానంద సూచనలతో టీటీడీ ఆగమేఘాల మీద శ్రీవారి ఆలయంలో సర్వదర్శనాన్ని తిరిగి మొదలు పెట్టిందన్న ప్రచారం విసృత్తంగా జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: