ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా అధికార పార్టీ టీఆర్‌ఎస్‌లో సంస్థాగత సందడి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నర ఏళ్లకుపైగా గడువు ఉండటంతో.. ఎన్నికల దాకా అదే వ్యక్తి అధ్యక్షుడిగా కొనసాగే అవకాశమే ఉంది. దీంతో జిల్లాల్లో పార్టీని నడిపించే గులాబీ దళపతులు ఎవరు? అనే అంశం హాట్‌ టాపిక్‌గా మారింది. మారుతున్న రాజకీయ పరిణామాల క్రమంలో ఈ సమయం కీలకం కావడంతో గులాబీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల దృష్టి అంతా అధ్యక్ష పీఠంపైనే నెలకొంది. ఇప్పటివరకు ఎవరి పేర్లు బాహాటంగా వెల్లడి కాలేదు. కానీ రేసులో వీరున్నారు, వారున్నారనే ప్రచారం మాత్రం జోరందుకుంది. అధిష్టానం నిర్ణయమే ఫైనల్‌ అని ఆశావహులు చెబుతున్నప్పటికీ.. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. కానీ జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో మాత్రం చాలా మంది ఆశావహులు.. జిల్లా అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఈ రెండు జిల్లాల్లోని నాయకులు ఎవరికి వారు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించి నారాయణపేట జిల్లాలో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, ఎమ్మెల్యేలు కలిసి ఓ అభిప్రాయానికి వచ్చారని సమాచారం. అలాగే మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లోనూ మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్‌ నేతలందరూ ఏకతాటిపైనే ఉన్నారని తెలుస్తోంది. కానీ జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో మాత్రం భిన్న పరిస్థితులు ఉన్నాయి.
ఈనెల 2న పార్టీ జెండా పండుగతో నూతనంగా పార్టీ కమిటీల ఎన్నిక ప్రక్రియ ప్రారంభం అయింది. ఇప్పటికే గ్రామ, వార్డు, అనుబంధ కమిటీల ఎన్నిక పూర్తయింది. ఈనెల 20 వరకు మండల, పట్టణ కమిటీల ఎన్నిక ప్రక్రియ పూర్తి చేసి.. నెలాఖరులో జిల్లా అధ్యక్షులను ఎన్నుకోనున్నారు. తర్వాత పార్టీ జిల్లా కమిటీలు రూపుదిద్దుకోనున్నాయి.

జిల్లా టీఆర్ఎస్‌ అధ్యక్షుడు, జిల్లా కమిటీ ఎన్నికపై మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలో ఆ పార్టీ నేతలందరూ ఏకతాటిపై ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఈ రెండు జిల్లాలను లీడ్‌ చేస్తున్నారు. మహబూబ్‌నగర్‌కు సంబంధించి జడ్చర్ల, దేవరకద్ర ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో పాటు ముఖ్య నేతలు సమష్టి నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. నారాయణపేటకు జిల్లాలో ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి సైతం మంత్రితో కలిసి అవగాహనకు వచ్చినట్లు తెలిసింది. మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న వనపర్తి జిల్లాలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. అయితే గద్వాల, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. వర్గ విభేదాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: