అమెరికాలోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రధాని మోడీ ప్రసంగించారు. వందేళ్లలో ఎప్పుడూ చూడని విపత్తు కరోనాను చూశామనీ.. కరోనా వల్ల మరణించిన వారందరికీ నివాళుర్పిస్తున్నట్టు తెలిపారు మోడీ. సమాజంలో ప్రతి వ్యక్తీ సంతోషంగా ఉండాలనేదే భారతీయుల కోరికన్నారు. భారత్.. ప్రజాస్వామ్య ప్రకాశానికి ఉదాహరణగా చెప్పుకొచ్చారు. అనేక డిజిటల్ సంస్కరణలను భారత్ తీసుకొచ్చినట్టు తెలిపారు. భారత్ లోని వైవిధ్యమే ప్రజాస్వామ్యాన్ని బలంగా మార్చింది అని మోడీ అన్నారు.  

ఆప్ఘానిస్థాన్ లోని మైనార్టీలు చాలా ప్రమాదంలో ఉన్నారని ప్రధాని మోడీ అన్నారు. ఆప్ఘాన్ లోని మైనార్టీలకు ఇప్పుడు ప్రపంచ దేశాల సాయం అవసరమని అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు గళం విప్పాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరులో భారత్ ముందుంటుందనీ.. కొన్ని దేశాలు తీవ్రవాదాన్ని ఆయుధంగా వాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవి ఆ దేశాలకే ప్రమాదకరమని ఆందోళన చెందారు ప్రధాని మోడీ. ఉగ్రవాదం ప్రపంచానికి ముప్పుగా మారవచ్చన్నారు. ఆప్ఘాన్ కుంపట్లలో ఏ దేశం కూడా చలి కాచుకోకూడదు అని మోడీ అన్నారు.

అంతేకాదు క్వాడ్ సదస్సులో ప్రధాని మోడీ ప్రసంగించారు. ప్రపంచ శ్రేయస్సు కోసమే ఈ భేటీ జరిగినట్టు ఆయన వెల్లడించారు. క్వాడ్ వ్యాక్సిన్ కార్యక్రమం ఇండో-పసిఫిక్ దేశాలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. సప్లై చైన్, ప్రపంచ భద్రత, వాతావరణ మార్పులు, కొవిడ్ పై యుద్ధం తదితర అంశాలపై ప్రధాని మాట్లాడారు. ఈ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని మారిసన్, జపాన్ ప్రధాని సుగా పాల్గొన్నారు.

మరోవైపు భారత్ చేపట్టిన సంస్కరణలను అమెరికా వ్యాపారాధిపతులు, టెక్ దిగ్గజ కంపెనీల సీఈఓలు ప్రశంసించారని విదేశీ వ్యవహారాల కార్యదర్శి హర్ష్ వర్ధన్ శ్రింగ్లా అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీతో సమావేశం సందర్భంగా వారు ఇలా వ్యాఖ్యానించారని తెలిపారు. అయితే భారత్, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడితేనే ఇరు దేశాల మధ్య ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని.. మోడీ చెప్పినట్టు ఆయన పేర్కొన్నారు.
















మరింత సమాచారం తెలుసుకోండి: