తప్పు చేసి జైలుకు వెళ్లిన వారిలో పరివర్తన వస్తుందని అంటారు. ఇది అక్షరాల నిజమని మరోసారి నిరూపితం అయింది. గ్రామంలో సమస్యలను పరిష్కరించాలని అడిగిన గ్రామస్థుడిపై సర్పంచ్‌ ఆగ్రహించాడు. సహనం కోల్పోయాడు. విచక్షణా రహితంగా కొట్టాడు. గ్రామస్థులు అందరి ముందు అతడిపై దాడి చేశాడు. ఎగిరెగిరి కాళ్లతో తన్నాడు. అడ్డుకున్న వారిని సైతం పక్కకు నెట్టి మరీ చితకబాదాడు. వీరంగం సృష్టించాడు. సర్పంచ్‌ రెచ్చిపోవడం చూసి గ్రామస్థులు బెంబేలెత్తిపోయారు. కొందరు సర్పంచ్‌ దురాగతాన్ని తమ సెల్‌ఫోన్‌లలో బంధించారు. వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. వైరల్‌గా మారిన ఆ దృశ్యాలు పోలీసుల వరకు చేరాయి. దీనికి తోడు బాధిత గ్రామస్థుడు ఇచ్చిన ఫిర్యాదుతో అతడిపై దాడికి పాల్పడిన సర్పంచ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కటకటాల్లోకి వెళ్లిన సర్పంచ్‌కు చివరకు జైలులో జ్ఞానోదయం అయింది. జైలు నుంచి బయటకు వచ్చాక బాధితుడి ఇంటికి వెళ్లి క్షమాపణ కోరాడు.

వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం దామాస్తాపూర్ గ్రామంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలంటూ అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ అనే వ్యక్తి.. గ్రామ సర్పంచ్‌ జైపాల్‌రెడ్డికి తరుచూ విన్నవిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈనెల 21న సర్పంచ్ జైపాల్ రెడ్డిని గ్రామస్థుడు శ్రీనివాస్ మరోసారి అడిగాడు. దీంతో సర్పంచ్‌ జైపాల్‌రెడ్డి సహనం కోల్పోయాడు. అతడిని కాళ్లతో ఎగిరెగిరి తన్నాడు. ఇది గ్రామంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే సర్పంజ్‌ జైపాల్‌రెడ్డి దాడిలో తవ్రంగా గాయపడిన శ్రీనివాస్‌.. అదేరోజున మర్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరుసటి రోజున సర్పంచ్‌ జైపాల్‌రెడ్డి దాడి చేసిన దృశ్యాలు ప్రసార మాధ్యమాల్లో రావడంతో వికారాబాద్ డీఎస్పీ సంజీవరావు స్పందించాడు. విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సర్పంచ్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దాడికి పాల్పడిన జైపాల్‌రెడ్డిని అరెస్ట్‌ చేసి రిమాండుకి తరలించారు.

జైలుకు వెళ్లిన సర్పంచ్‌ జైపాల్‌రెడ్డి బెయిల్‌పై బయటకు వచ్చాడు. అయితే ఆయనకు జైలులో జ్ఞానోదయం అయినట్లుగా ఉంది. గ్రామానికి వచ్చీ రాగానే నేరుగా తన చేతుల్లో దెబ్బలు తిని గాయాలపాలైన శ్రీనివాస్‌ ఇంటికి వెళ్లాడు. అక్కడికి గ్రామస్థులను కూడా పిలిపించాడు. వారందరి ఎదురుగా శ్రీనివాస్‌, ఆయన భార్యకు చేతులు జోడించి క్షమాపణలు చెప్పాడు. తాను చేసింది చాలా తప్పని, ఆ సంఘటన తలుచుకుంటే తనకే బాధ వేస్తుందని, తనను క్షమించాలని ప్రాధేయపడ్డాడు. మొత్తంమీద సర్పంచ్‌ సారీ చెప్పడం గ్రామంలో మరోసారి చర్చనీయాంశంగా మారింది. తొలుత కాళ్లు జాడించి కొట్టి.. తర్వాత జోతులు జోడించి క్షమాపణ చెప్పడం టాక్‌ ఆఫ్‌ ద విలేజ్‌ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: