తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఎప్పటికీ ఆసక్తికరంగానే ఉంటాయి. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయల గురించి దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది కూడా. ఇక రాష్ట్రంలో అయితే రాజకీయాలు శరవేగంగా మారుతుంటాయి కూడా. నిత్యం రాజకీయ విమర్శలు, దాడులు, ప్రతిదాడులతో హెడ్ లైన్ వార్తలు వస్తూనే ఉంటాయి. ఇక రాజకీయ పార్టీల మధ్య పొత్తుల అంశం అయితే... ఇక అది ఎవర్ హాట్ టాపిక్. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో పొత్తు పెట్టుకున్న టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు... ఆ తర్వాత ఎవరికి వారే అన్నట్లుగా విడిపోయాయి. ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీకి మద్దతు తెలిపిన టీడీపీ... ఆ తర్వాత కమలం పార్టీతో తెగదెంపులు చేసుకునేలా ప్లాన్ చేశారు వైఎస్ జగన్. ప్రత్యేక హోదా విషయంలో గట్టిగానే పోరాటం చేసిన చంద్రబాబు... చివరికి బీజేపీ, జనసేన పార్టీలకు దూరం కూడా అయ్యారు.

2019 ఎన్నికల్లో ఎవరికి వారే అన్నట్లుగా పోటీ చేశాయి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు. ఎన్నికల అనంతరం బీజేపీతో జనసేనాని జత కట్టారు. తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రత్న ప్రభ కోసం పవన్ కల్యాణ్ స్వయంగా ప్రచారం కూడా చేశారు. ఆ తర్వాత జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సైతం కమలం, గ్లాస్ పొత్తు కొనసాగింది. అయితే ఫలితాల అనంతరం రాజకీయాల్లో సంచలనమే జరుగుతోంది. రాష్ట్రంలో కొన్ని చోట్ల ఎంపీపీ స్థానాలను దక్కించుకునేందుకు జనసేనతో జత కట్టింది టీడీపీ. ఇది లోపాయికారి ఒప్పందమే అయినప్పటికీ... దీనిపై కమలం పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. ప్రధాని మోదీపై ఘాటు వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుతో ఎలా పొత్తు పెట్టుకుంటారని జనసైనికులను తప్పుబడుతోంది బీజేపీ. ఇదే సమయంలో సైకిల్, గ్లాస్ పొత్తుపై మాజీ మంత్రులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన టీడీపీ నేతలు... పితాని సత్యనారాయణ, గొల్లపల్లి సూర్యారావు వ్యాఖ్యానించారు. టీడీపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుంటే... రాబోయే ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని సూచించారు. ఈ పొత్తుపై పార్టీ అధినేతలు ఆలోచించాలని కూడా వ్యాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: