తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం తుఫాన్ గా మారిపోయింది.. ఇక‌ ఆ తుఫాన్ కు గులాబ్ గా నామకరణం చేశారు. గోపాలపూర్ కు 370కిమీ అదేవిధంగా కళింగపట్నానికి 440 కిమీ దూరంలో కేంద్రీకృతం అయిన‌ట్టు వాతావ‌ర‌ణ‌శాఖ అధికారులు గుర్తించారు. వాయుగుండం పశ్చిమ దిశగా పయనించి రేపు సాయంత్రానికి కళింగపట్నం - గోపాలపూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ‌శాఖ అదికారులు చెబుతున్నారు. రేపు ఉత్తరాంధ్రలో తుఫాన్ ఎఫెక్ట్ వ‌ల్ల అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌ట్టు వాతావ‌ర‌ణ‌శాఖ అధికారులు చెబుతున్నారు. మిగిలిన చోట్ల కూడా అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్న‌ట్టు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెల్ల‌డించారు. 

రేపు మధ్యాహ్నం నుండి ఉత్తరాంధ్ర  తీరం వెంబడి గంటకు 75 - 95 కీమీ వేగంతో బలమైన ఈదురగాలులు వీచే అవ‌కాశం ఉన్న‌ట్టు వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. అంతే కాకుండా సముద్రం అలజడిగా ఉంటుందని కాబ‌ట్టి మత్స్యకారులు సోమవారం వరకు కూడా వేటకు వెళ్ళరాదని వాతావ‌ర‌ణ‌శాఖ హెచ్చ‌రించింది. ఇదిలా ఉండ‌గా గులాబ్ తుఫాన్ పరిస్థితులపై సీఎం వైఎస్ జ‌గ‌న్ ఆరా తీశారు. గులాబ్ తుఫాన్ ప‌ట్ల అన్నిరకాల చర్యలు తీసుకోవాలని సీఎం అధికారుల‌కు ఆదేశించారు.

తుపాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లను అప్రమత్తంచేశామని వారు తీసుకోవాల్సిన చర్యలపై వారికి తగిన సూచనలు చేశామని అధికారులు సీఎం జ‌గ‌న్ కు వివ‌రించారు. గ్రామ సచివాలయాల వారీగా కంట్రోలు రూమ్ లు ఏర్పాటు చేశామ‌ని... విశాఖ ప‌ట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో విపత్తు నిర్వహణ సిబ్బందిని కూడా సిద్ధంచేశామ‌ని అధికారులు ముఖ్య‌మంత్రికి తెలిపారు. అవసరమైన చోట శిబిరాలు తెరిచేందుకు కలెక్టర్లు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నార‌ని ముఖ్యమంత్రికి అధికారులు వివ‌రించారు. తుఫాన్ అనంతరం పరిస్థితులపైన కూడా అప్రమత్తంగా ఉండాలని సీఎం జ‌గ‌న్ అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: