తెలంగాణాలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక పాలన సాగుతున్నా కూడా యువత మౌనంగా ఎందుకు ఉంటోంది అంటూ బీజేపీ నేత విజయశాంతి ఘాటుగా ప్రసంగించారు. ఉపఎన్నికల కోసం జరుగుతున్న ప్రచారంలో బీజేపీ తరుపున ఆమె అధికార తెరాస పై విరుచుకుపడ్డారు. యువతకు సిగ్గులేదా, పౌరుషం లేదా, కేసీఆర్ పాలనలో ఎందుకు బానిసల్లాగా బ్రతుకుతున్నారు, పక్కోడు మోసం చేస్తే ఉద్యమించారు కదా, మనోడు నమ్మించి మోసం చేస్తుంటే మౌనంగా ఎందుకు ఉంటున్నారు అంటూ ఆమె భావోద్వేగ ప్రసంగం చేశారు. రాష్ట్రంలో సమస్యలు తీరాలంటే ఆత్మహత్యలు చేసుకోవడం కాదు, ఉద్యమాలు చేయాలని ఆమె యువతకు పిలుపునిచ్చారు.

ఎక్కడైనా యువత, రైతులు తిరగబడితేనే నాయకత్వం దిగివస్తుందని ప్రజాసంగ్రామ యాత్రలో పాల్గొన్న బీజేపీ నేత విజయశాంతి అన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజాక్షేత్రంలోకి వచ్చి పథకాలతో నాలుగు చిల్లర డబ్బులు యర వేసి గెలవగానే ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకునే కేసీఆర్ కు బుద్ది చెప్పాల్సిన సమయం ఇదే అని ఆమె అన్నారు. ఆయనను ప్రశ్నించిన వారిపై కేసులు బరాయిస్తూ అధికార మదం చూపించుకుంటున్నారు. విపక్షాలు అన్నతరువాత ప్రభుత్వం చేస్తున్న తప్పులు ఎత్తి చూపిస్తుంది, అందుకని వాళ్లపై కేసులు పెట్టడం ఏంటని ఆమె ప్రశ్నించారు. తప్పు చేసి, అది ఎత్తి చూపినందుకు మరో తప్పు చేస్తూ కేసీఆర్ ప్రభుత్వం తన పతనాన్ని తానే కొనితెచ్చుకుంటుంది అని ఆమె అన్నారు.

బీజేపీ ప్రజాసంగ్రామ యాత్ర చేస్తుంటే ప్రజలు సమస్యలు చెప్పుకోడానికి బారులు తీరుతుంటేనే రాష్ట్రంలో పాలన ఎలా ఉందొ స్పష్టం అవుతుందని విజయశాంతి అన్నారు. బీజేపీ యాత్రపై అధికారపక్షం అనేక విమర్శలు చేస్తుండటం హాస్యాస్పదంగా ఉంది, వాళ్ళు ఎన్నికల సమయంలో తప్ప బయట కనిపించరు, ప్రజాసమస్యలు పట్టవు. బీజేపీ ప్రజాసమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటే ఓర్వలేకపోతున్నారు అన్నారు విజయశాంతి. రాష్ట్రంలో కుటుంబ పాలన తప్ప మరొకటి కనిపించడం లేదు, తెరాస పార్టీ పెట్టినప్పుడు వాళ్ళ ఆస్తులు ఎన్ని, ఇప్పుడు ఎన్నో చర్చకు రావాలి అప్పుడు రాష్ట్రము అభివృద్ధి చెందిందో వాళ్ళ  కుటుంబం అభివృద్ధి చెందిందో తేలిపోతుందని ఆమె అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: