పవన్ కల్యాణ్... అటు సినిమాల్లోనూ... ఇటు రాజకీయాల్లో కూడా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సాధించుకున్న స్టార్ హీరో. తెరపై పవర్ స్టార్ కనిపిస్తే చాలు అనుకునే అభిమానులున్నారు. ఇక ఆయన కోసం ఏమైనా చేస్తామనే డై హార్డ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అంతెందుకూ... పవన్ వస్తున్నాడని తెలిస్తే చాలు... కిలోమీటర్ల దూరం బైక్ ర్యాలీలతో ఫాలో అయిపోతారు కూడా. ఇక రాజకీయ సభలు ఏర్పాటు చేస్తే... అబ్బో... ఇసుకేస్తే రాలనంత జనం. ఇక అభిమానులైతే... ఎక్కడ మీటింగ్ జరిగినా కూడా... సీఎం... సీఎం... సీఎం.. అంటూ తెగ గోల చేసేస్తారు. తమ అభిమాన నేతను ఎవరైనా ఏమైనా అంటే... ఎంతవరకైనా తెగిస్తారు కూడా. ఇలాంటి అభిమానులను సంపాదించిన పవన్ స్టార్ పవన్ కల్యాణ్... జనసేన పార్టీ పేరుతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2014 ఎన్నికల సమయంలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలకు మద్దతుగా ప్రచారం చేసిన జనసేనాని... చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు కూడా. ఇక ఆ తర్వాత అనూహ్య పరిణామాలతో అదే తెలుగుదేశం పార్టీపై తిరుగుబావుటా ఎగురవేశారు.

రాజధాని అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు సర్కార్ 33 వేల ఎకరాల భూమిని సేకరించడంపై అప్పట్లో జనసేనాని తప్పుబట్టారు. రాజధానిలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా ఆందోళనలు కూడా చేశారు. అంతటితో ఆగకుండా... 2019 సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేశారు. రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసిన పవన్... అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. అయినా సరే... జగన్ సర్కార్‌పై తన పోరాటం కొనసాగించారు. అయితే ఇదే సమయంలో మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టిన పవన్... వరుసగా సినిమాలు తీస్తున్నారు. కొద్ది రోజుల పాటు రాజకీయాలకు కామా పెట్టిన జనసేనాని.. తాజాగా రిపబ్లిక్ సినిమా ఫంక్షన్‌లో తన వాయిస్ రైజ్ చేశారు. అసలు అది సినిమా ఫంక్షనా... లేక రాజకీయ వేదికా అన్నట్లుగా ప్రసంగించారు. సినిమాల గురించి కామెంట్ చేస్తూనే... అందుకు రాజకీయాలను లింక్ చేశారు. తన జోలికి ఎవరైనా వస్తే... ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. సినిమా పరిశ్రమకు రాజకీయ నేతలు పెడుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ... ఇండస్ట్రీ వైపు కన్నెత్తి చూస్తే... కాలిపోతారు జాగ్రత్త అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు పవన్. ఇన్ని రోజులు సైలెంట్‌గా జనసేనాని... పరిషత్ ఎన్నికల ఫలితాల తర్వాత... వాయిస్ రైజ్ చేయడం... ఇప్పుడు హాట్ హాట్‌గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: