సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తరువాత అంతటా కొత్త విధానాలు అమలులోకి వస్తున్నాయి. ఒకప్పుడు ఫోన్ అంటే కేవలం దూరప్రాంతాల వారితో మాట్లాడుకునేందుకు మాత్రమే వాడేవారు. అదికూడా వైరు ఉంటేగాని పనిచేసేవి కావు. అప్పుడు బిల్స్ కూడా ఎంత వాడుకుంటే అంత నెలనెలా కట్టుకుంటూ ఉండాల్సి వస్తుండేది. అనంతరం వైర్లెస్ వచ్చేశాయి. అటుతరువాత మొబైల్స్ వచ్చేశాయి. ఇక్కడ నుండి మరింతగా సాంకేతిక విప్లవం వచ్చేసింది. ముందస్తుగా డబ్బు చెల్లించి అది అయిపోయేదాకా వాడుకోవడం, అనంతరం మళ్ళీ రీఛార్జ్ చేయించుకోవడం చేస్తున్నాం. ఇక స్మార్ట్ ఫోన్ చేతిలోకి వచ్చేశాక ఈ విధానం కూడా చాలా సులువు అయిపోయింది. కేవలం ఇంట్లో ఉండి అన్ని చెల్లింపులు చేసేసుకుంటున్నాం.

ప్రభుత్వం కూడా తమ చెల్లింపులన్నీ సులభతరం చేసేందుకు ప్రతిదానిలో ఆన్ లైన్ విధానం తెస్తుంది. ఆయా కార్యాలయాలకు వెళ్లి క్యూ లలో గంటల తరబడి నిల్చొని బిల్లులు చెల్లించాల్సి వచ్చేది ఒకప్పుడు. ఇప్పుడు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటె చాలు ఇంట్లోనే అన్ని చెల్లింపులు చేసుకోవచ్చు. కావాలంటే చాలా వాటికి ముందస్తు చెల్లింపులు కూడా చేసుకునే సౌలభ్యం కల్పిస్తున్నారు. దీనివలన ముందే వాళ్ళ ఖజానాలోకి నిధులు వస్తాయి కాబట్టి ప్రభుత్వాలు కూడా ఈ వెసులుబాటు ఇస్తున్నాయి.

తాజాగా తెలంగాణాలో విద్యుత్ మీటర్ లకు కూడా ప్రీపెయిడ్ సౌలభ్యం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ సంస్థలకు, కొత్తగా కనెక్షన్ తీసుకుంటున్న వారికి ఈ విధానం అమలు చేస్తున్నారు. ప్రీపెయిడ్ అంటే తెలుసు కదా, కావాల్సినంత రీఛార్జ్ చేసుకోవడం, అది అయిపోగానే మళ్ళీ రీఛార్జ్ చేసుకోవడం తప్పనిసరి. అయిపోయిన మరుక్షణమే ఇతర విధానాలలో సేవలు ఆగిపోయినట్టే ఈ తరహా విద్యుత్ మీటర్ లకు కూడా సరఫరా ఆగిపోతుంది. అప్పుడు మళ్ళీ రీఛార్జ్ చేస్తే సరఫరా యధావిధిగా జరుగుతుంటుంది. ముందుగా హైదరాబాద్ సహా పలు ప్రాంతాలలో ప్రయోగాత్మకంగా 28800 స్మార్ట్ విద్యుత్ మీటర్లు ప్రవేశపెడుతున్నారు.  దీనికి కేంద్రం 15శాతం సబ్సిడీ అందించడానికి ముందుకు వచ్చింది, రాష్ట్రప్రభుత్వం కనీసం 50-60 శాతం సబ్సిడీ కోసం ఎదురుచూస్తుంది. ఈ పద్దతి వలన ప్రసార, పంపిణి, వాణిజ్య నష్టాలు తగ్గుతాయని ప్రభుత్వాలు భావిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: