టీడీపీకి చెందిన సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి, మాజీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి ఫ్యామిలీ కొద్ది రోజులుగా టీడీపీ వాళ్ల‌పై తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేస్తూ క‌ల‌క‌లం రేపుతోంది. జేసీ దివాక‌ర్ రెడ్డితో పాటు ఆయ‌న సోద‌రుడు తాడిప‌త్రి మున్సిప‌ల్ చ‌ర్మ‌న్ జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి ప‌దునైన వ్యాఖ్య‌ల‌తో టీడీపీ లో సెగ‌లు రేపుతున్నారు. ఇప్ప‌టికే వాళ్లు త‌మ సొంత నియోజ‌క‌వ‌ర్గం తాడిప‌త్రితో పాటు అనంత‌పురం అర్బ‌న్ - శింగ‌న‌మ‌ల నియోజ‌క‌వ‌ర్గాల‌ను త‌మ కంట్ర‌ల్లో పెట్టుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు వీరి క‌న్ను పుట్ట‌ప‌ర్తి మీద కూడా ప‌డిందా ? అంటే అవున‌నే సందేహాలు వ‌స్తున్నాయి.

పుట్టపర్తి నియోజకవర్గం లో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పర్యటన ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతోంది. కొద్ది రోజుల క్రిత‌మే ఆయ‌న అనంత‌పురం పార్ల‌మెంట‌రీ జిల్లా అధ్య‌క్షుడు, మాజీ ఎంపీ కాల్వ శ్రీనివాసుల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇక ఇప్పుడు ఆయ‌న ఏకంగా పుట్ట‌ప‌ర్తిలో ప‌ర్య‌టించ‌డంతో ఆయ‌న మాజీ మంత్రి ప‌ల్లె ర‌ఘునాథ్ రెడ్డిని టార్గెట్ చేశార‌ని టీడీపీ వాళ్లే చ‌ర్చించు కుంటున్నారు. ఈ రోజు ప‌ర్య‌ట‌న‌లో జేసీ వెంట మాజీ మున్సిపల్ ఛైర్మన్ గంగన్న సహా పలువురు ప్రముఖులు ఉన్నారు.

ముందుగా సత్యసాయి మహా సమాధి దర్శనం అనంతరం అసమ్మతి నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీకి దూరంగా ఉన్న నేతలను పార్టీలోకి తీసుకురావడానికి వచ్చాన‌ని... చంద్రబాబు ని సీఎం ను చేయడమే లక్షంగా అందరూ పనిచేయాల‌ని... పార్టీకి దూరమైన నేతలు, కార్యకర్తలు కలిసి రావాలని ఆయ‌న ఆకాంక్షించారు. అందుకోసమే తాను జిల్లా లో తిరుగుతున్నా అని కూడా జేసీ కుండ బ‌ద్ద‌లు కొట్టారు. అయితే జేసీ ఫ్యామిలీ ఇటీవ‌ల జిల్లా పెత్త‌నం కోసం ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

ఈ ప్లాన్ లో భాగంగానే ప్ర‌భాక‌ర్ ఇప్పుడు పుట్ట‌ప‌ర్తిలో ప‌ర్య‌టిస్తున్నార‌ని అంటున్నారు. ఇంకా చెప్పాలంటే వాళ్లు తాడిప‌త్రితో పాటు పుట్ట‌ప‌ర్తి మీద కూడా క‌న్నేసి అక్క‌డ అస‌మ్మ‌తి నేత‌ల స‌మావేశం ఏర్పాటు చేశార‌ని తెలుస్తోంది. మ‌రి ఈ కెలుకుడు పార్టీని ఇంకెంత న‌ష్ట‌ప‌రుస్తుందో ?  చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: