మంత్రుల క‌న్నా మంత్రుల హోదాలో రాష్ట్రంలో ఉద్యోగాలు వెల‌గ‌బెడుతున్న స‌ల‌హారావులే ఎక్కువ ఉన్నారు. దీంతో వీరికి జీతాల చెల్లింపు అన్న‌ది ఖ‌జానాకు భారం అయినా ఏలిక‌ల ఆదేశాలు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఇటీవ‌ల కాలాన రిటైర్డు ఐఏఎస్ ల‌ను ఇంటికి పంపడం ఇష్ట‌లేక పాపం జ‌గన్ ఇలా నియామ‌కాలు చేస్తూ, పునరావాస కేంద్రాల‌లో వీరిని చేరుస్తున్నార‌ని టీడీపీ మండిప‌డుతోంది.

ఎంత మంది స‌ల‌హాదారులు ఉన్నా కొత్త వారు వ‌స్తూనే ఉన్నారు. ఈ కోవ‌లో రేపో మాపో చీఫ్ సెక్ర‌ట‌రీ ప‌దవి నుంచి విర‌మ‌ణ తీసుకోనున్న ఆదిత్యానాథ్ దాస్ ను మ‌రో స‌లహాదారుగా నియ‌మించారు. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు కూడా జారీ అయిపోయాయి.


 
ఆయ‌న‌కు కేబినేట్ హోదా కూడా క‌ట్ట‌బెట్టారు. ఇంకేం ఎదురేలేదు. స‌ల‌హాదారుల నియామ‌కం వ‌ర‌కే జ‌గ‌న్ ఉత్సాహం చూపుతున్నార‌ని కానీ వారు చెప్పే మాట‌లు పెడ‌చెవిన పెడుతున్నార‌న్న వాద‌న కూడా ఉంది. ఐతే అప్పుల కోసం స‌ల‌హాదారు, ఆస్తుల తాక‌ట్టు కోసం స‌ల‌హాదారు ఇలా రోజుకో పేరు ఎందుక‌ని తెర‌పైకి తెస్తున్నార‌ని, ఇదంతా ప్ర‌జా ధ‌నం వృథా చేయ‌డం కింద‌కే వ‌స్తుంద‌ని టీడీపీ  మండిప‌డుతోంది. మీడియా స‌ల‌హాదారు ఉన్నా ఆయనేం చేస్తున్న‌ది లేదు. ఢిల్లీలో ఏపీ వ్య‌వ‌హారాలు చ‌క్క‌దిద్దేందుకు స‌ల‌హాదారులు ఉన్నా వారూ అంతే! అని విమ‌ర్శిస్తోంది.


అప్పులు ఎలా ఉన్నా, ఆదాయం లేక‌పోయినా జ‌గ‌న్ తీరు మాత్రం మార‌డం లేదు. అప్పులు చేసి రాష్ట్రాన్ని న‌డ‌ప‌డంలో దేశంలోనే నంబ‌ర్ ఒన్ స్థానంలో ఉన్నారు. ఆయ‌ను దాటి ఏ రాష్ట్ర సీఎం కూడా లేరు. బ‌డ్జెట్ ప్ర‌తిపాదిత అప్పును నాలుగు నెలల్లోనే ఖ‌ర్చు చేశార‌ని కాగ్ అంటోంది. మ‌న‌తో పోలిస్తే తెలంగాణ మాత్రం అంత వేగంగా ఖ‌ర్చు విష‌య‌మై లేదు. బ‌డ్జెట్ ప్ర‌తిపాదిత అప్పుల్లో ఏపీ 97.68శాతం వెచ్చించ‌గా, తెలంగాణ మాత్రం 32.89శాతం ఖ‌ర్చు చేయ‌డం విశేషం. అయినప్ప‌టికీ జ‌గ‌న్ ప్ర‌భుత్వం బెద‌ర‌డం లేదు.ఏపీ త‌రువాత స్థానాల‌లో మిజోరం, కేర‌ళ, రాజ‌స్థాన్ ఉన్నాయి. ఐదో స్థానంలో తెలంగాణ ఉంది. తీసుకున్న అప్పుల‌ను శ‌ర‌వేగంగా జ‌గ‌న్ ఖ‌ర్చు చేయ‌డంతో కొత్త అప్పుల కోసం పరుగులు తీస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న ఖర్చులు త‌గ్గ‌వు. కొత్త స‌ల‌హాదారుల రాక కూడా త‌గ్గ‌దు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap