తెలంగాణ కాంగ్రెస్ లో అంత‌ర్గ‌త ప్ర‌జా స్వామ్యం ఎక్కువ ఉందంటూ సీనియ‌ర్ నాయ‌కులు ఇష్టా రీతిని ప్ర‌వ‌ర్తిస్తుంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి సొంత పార్టీ సీనియ‌ర్ నేత‌ల‌తో నానా తంటాలు ప‌డుతున్నారు. అయినా, పార్టీని ముందుకు తీసుకువెళ్ల‌డానికి రేవంత్ వాళ్ల‌తో క‌లిసి ప్ర‌యాణిస్తున్నాడు. రెండు రోజుల క్రితం రేవంత్ రెడ్డి  పై జ‌గ్గారెడ్డి చేసిన కామెంట్లు కాంగ్రెస్ పార్టీతో పాటు రాష్ట్ర రాజ‌కీయంలో చ‌ర్చ లేపింది. రేవంత్ రెడ్డిపై జ‌గ్గారెడ్డి విరుచుకుప‌డిన తీరు చూసి మ‌రోసారి కాంగ్రెస్ మార‌ద‌ని నిరూపించుకుంది. 


దీంతో తీవ్రంగా స్పందించిన హ‌స్తం పార్టీ అధిష్టానం జ‌గ్గారెడ్డికి వార్నింగ్ ఇచ్చింది. దీంతో త‌ప్పంతా నాదేన‌ని ఒప్పుకుని రేవంత్ రెడ్డికి క్ష‌మాప‌ణ చెప్పారు. అలాగే, భ‌విష్య‌త్తులో మీడియా ముందు ఉంటాన‌ని పేర్కొన్నారు. దీంతో చెంప‌లేసుకున్నంత ప‌ని చేశారు జ‌గ్గారెడ్డి. ఈ క్ర‌మంలో జ‌గ్గారెడ్డి ఎపిసోడ్ కొలిక్కి వ‌చ్చింద‌నుకునే లోపే మ‌రో అస‌మ్మ‌తి నేత కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి రేవంత్ వ్య‌తిరేక గ‌ళం విప్పారు. ఇటీవ‌ల పార్టీ వ్య‌వ‌హారాల్లో అట్టిముట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్న ఆయ‌న తీరు హాట్ టాపిక్‌గా మారింది.


టీపీసీసీ కొత్త క‌మిటీ నియామ‌కం త‌రువాత పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటూ అప్పుడ‌ప్పుడు మీడియా ముందుకు వ‌చ్చి విమ‌ర్శ‌లు చేస్తున్నారు. దీని ద్వారా త‌న ఉనికి చాటుకుంటున్నారు కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి. పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్న ఆయ‌న త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌భుత్వ‌, పార్టీ కార్య‌క్ర‌మాల‌కు మాత్రం హాజ‌ర‌వుతున్నారు. అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా త‌న‌కు న‌చ్చ‌ని పార్టీ నాయ‌క‌త్వంపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయ‌న పార్టీకి ఎందుకు దూరంగా ఉంటున్నానో చెప్పుకొచ్చారు.


త‌న‌కు షో రాజ‌కీయాలు తెలియ‌వ‌ని, రెండేళ్ల‌లో ఎన్నిక‌లు వ‌స్తుంటే ఇదేనా పార్టీ స‌న్న‌ద్ధ‌త అంటూ ప‌రోక్షంగా రేవంత్ రెడ్డిపై విమ‌ర్శ‌లు చేశారు. సీనియ‌ర్ నానాయ‌కులు లేకుండానే నిర్ణ‌యాలు తీసుకుంటారా అని ప్ర‌శ్నించారు. హుజురాబాద్ అసెంబ్లీ సీటు ఖాళీ అయి నాలుగు నెల‌లు గ‌డుస్తున్నా, కొత్త పీసీసీ వ‌చ్చి మూడున్న‌ర నెల‌లు అయిన‌ప్ప‌టికీ  ప్ర‌ధాన ప్ర‌తి ప‌క్షం ఎందుకు రివ్యూ చేయ‌డం లేద‌ని, హుజురాబాద్‌కు పీసీసీ నేత ఎందుకు వెళ్ల‌ని రేవంత్ రెడ్డిపై విమ‌ర్శ‌లు గుప్పించారు.


పార్టీలో అస‌లు ఏం జ‌రుగుతుందో అర్థం కావ‌డం లేద‌ని అస‌హ‌నం వెల్ల‌గ‌క్కారు. ఎన్నిక‌లకు ముందే చేతులెత్తేసిందా అని ప్ర‌శ్నించారు. దీంతో గెలుపు మాట ప‌క్క‌న బెట్టి ఇలా త‌మ‌లో తామే కుమ్ములాడుకుంటే పార్టీ ప‌రిస్థితి ఏంట‌ని పార్టీ కార్య‌క‌ర్త‌లు ఆందోళ‌న చెందుతున్నారు.  జ‌గ్గారెడ్డిని సెట్ చేసిన కాంగ్రెస్ అధిష్టానం ఇక కొమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డిపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుంద‌నేది ఇప్పుడు ఆస‌క్తిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: