దేశంలో రాజకీయం మారుతోంది. దానికి అనుగుణంగా ఏపీలో రాజకీయం కూడా మార్పులు చెందుతోంది. 2019 ఎన్నికల ముందున్న రాజకీయం వేరు, 2024 ఎన్నికలను టార్గెట్ చేస్తూ సాగుతున్న రాజకీయం వేరు. ఇక తెలుగు రాజకీయాల్లో మరో రకమైన పాలిట్రిక్స్ చోటు చేసుకోనుంది.

ఏపీలో 2019 ఎన్నికల ముందు అధికారంలో ఉన్న టీడీపీ బీజేపీతో నాడు విభేదించింది. అది తమకు ప్లస్ అవుతుంది అని చంద్రబాబు భావించారు. అయితే అది రివర్స్ అయింది. నాడు బీజేపీని పల్లెత్తు మాట అనని జగన్ బాగానే సొమ్ము చేసుకున్నారు. ఇక 2024 ఎన్నికలకు అలాంటి పరిస్థితి ఉంటుందా అంటే లేదు అనే చెప్పాలి. జగన్ నాయకత్వాన వైసీపీ సొంతంగానే పోటీ చేస్తుంది. పైగా బీజేపీతో దూరాన్ని కూడా కొనసాగిస్తుంది అంటున్నారు. ఈ మధ్య ఢిల్లీ టూర్లను బాగా తగ్గించుకున్న వైసీపీ అధినాయకుడు బీజేపీతో కూడా దూరం పాటించాలని చూస్తున్నారు.

మరో వైపు బీజేపీకి వ్యతిరేకంగా తలపెట్టిన భారత్ బంద్ కి వైసీపీ పూర్తి మద్దతు ప్రకటించింది. కేంద్రంలో బీజేపీ గ్రాఫ్ తగ్గుతోంది. అదే విధంగా రైతు వ్యతిరేక చట్టాల మీద కూడా ఆ వర్గంలో ఆగ్రహం  ఉంది. దాంతో వ్యూహాత్మకంగానే వైసీపీ బంద్ కి మద్దతు ఇచ్చింది అంటున్నారు. ఇక తెలుగుదేశం కూడా బంద్ కి మద్దతు ప్రకటించింది. టీడీపీ విషయం తీసుకుంటే బీజేపీతో ప్రస్తుతానికి చెలిమిని కోరుతున్నట్లుగా ఉన్నా మారుతున్న జాతీయ రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని వ్యవహరించడానికి సిద్ధపడుతోంది. దాంతో టీడీపీ బంద్ కి మద్దతు ఇవ్వడం అంటే కమలానికి దూరం అని మెల్లగా చెప్పడమే.

ఇక ఏపీలో బీజేపీకి మిత్రుడిగా ఉన్న జనసేనాని బంద్ విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేదు. ఆయన మిత్రుడు కాబట్టి ఈ రోజుకు ఇలా ఉన్నా ఎన్నికలకు దగ్గరవుతున్న క్రమంలో తలాఖ్ అనేస్తారు అన్న చర్చ కూడా ఉంది. మొత్తానికి చూస్తే ఏపీలో మూడు ప్రాంతీయ పార్టీలు కూడా బీజేపీని టచ్ మీ నాట్ అనేలాగానే ఉన్నాయని అంటున్నారు. మరి ఏపీలో బీజేపీ రాజకీయం భూమిక ఈ విధంగా  ఉంటుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp