గులాబ్ తుఫాను తీరం తాకే ప్రక్రియ ప్రారంభమైంది. మరో 3-4గంటల్లో తీరం తాకే ప్రక్రియ పూర్తి కానున్నట్టు చెప్పిన భారత వాతావరణ శాఖ.. ప్రస్తుతానికి కళింగపట్నానికి 25కిలోమీటర్ల దూరంలో తుఫాను ఉన్నట్టు తెలిపింది. ప్రస్తుతం తీరంలో 75కిలోమీటర్ల నుంచి 85కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండగా.. గాలుల వేగం క్రమంగా 95కిలోమీటర్లకు పెరుగుతాయని హెచ్చరించింది.

గులాబ్ తుఫాను ఉత్తరాంధ్ర జిల్లాలపై అధిక ప్రభావం చూపుతుందన్న వాతావరణ హెచ్చరికతో శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకారులు, తీర ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బారువ, పొగరు దగ్గర 100బోట్లను లంగరు వేసి ఉంచుకున్న మత్స్యకారులు, మహేంద్రతనయ నుంచి భారీగా వరద వస్తే ఆ బోట్లన్నీ సముద్రంలోకి కొట్టుకుపోతాయని ఆవేదన చెందుతున్నారు. ఇక ఇచ్చాపురం నియోజకవర్గంలో అధికారుల సాయం కోసం 27గ్రామాల ప్రజలు ఎదురు చూస్తున్నారు.

గులాబ్ తుఫాన్ కారణంగా శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా జిల్లాలో 08942-240557, 6309990933 నెంబర్లతో కంట్రోల్ రూమ్ లను అందుబాటులోకి తెచ్చారు. జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ శ్రీకేష్ ఆదేశించారు. అటు వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో సముద్రంలో పడవ బోల్తాపడి ఇద్దరు మత్స్యకారులు చనిపోగా.. ఒకరు గల్లంతయ్యారు. ముగ్గురు సురక్షితంగా బయటికొచ్చారు.

ఇంత ప్రమాద సమయంలో మత్స్యకారులు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. గంగపుత్రులు  చేపలవేటకు వెళ్లొద్దు. పుకార్లను అసలే నమ్మొద్దు. వాతావరణ హెచ్చరికల కోసం రేడియో వినడంతో పాటు టీవీ చూడాలి.. తరచూ పేపర్లు చదువుతూ ఉండాలి. పడవలు, తెప్పలను సురక్షిత ప్రాంతంలో కట్టి ఉంచాలి. అత్యవసర సమయంలో వాడేందుకు మొబైల్స్ ను ఛార్జ్ చేసి ఉంచాలి. ముఖ్యమైన ఫోన్ నెంబర్లను కాగితంపై రాసి జాగ్రత్తగా ఉంచుకోవాలి.

ఇక వర్షం కురుసే సమయంలో ఎవరైనా.. పాత భవనాల ముందు నిలబడకూడదు. వీలైనంత త్వరగా సురక్షితమైన ప్రాంతాలకు తరలివెళ్లాలి. చెట్లు, విద్యుత్ స్తంభం కింద నిలబడకూడదు. వాతావరణం ప్రశాంతంగా ఉంటే తుఫాను ముగిసింది అనుకోకూడదు.. మరొక దిశ నుండి పెద్ద గాలులు ప్రారంభమయ్యే ప్రమాదముంది. కాబట్టి ఈ వర్షాకాల సమయంలో అందరూ ఈ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది.మరింత సమాచారం తెలుసుకోండి: