సినిమా టికెట్ల వ్యవహారంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మూకుమ్మడి దాడి చేసింది. మంత్రులంతా విడతల వారీగా ఒకరి తర్వాత ఒకరు ఘాటుగా స్పందించారు. పవన్ కల్యాణ్ కి స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు. అయితే ఈ ఎపిసోడ్ లో టీడీపీ ఎందుకు సైలెంట్ గా ఉందనేదే అసలు ప్రశ్న. సినిమా టికెట్ల ఆన్ లైన్ అమ్మకంపై గతంలో టీడీపీ నేతలు వైసీపీ నిర్ణయంపై విమర్శలు గుప్పించారు. అలాంటి టీడీపీ.. ఇప్పుడు పవన్ ఈ సమస్యను లేవనెత్తిన తర్వాత కనీసం మద్దతు తెలపలేదు. పవన్ పై వరుసగా కౌంటర్లు పడుతున్నా నోరు మెదపలేదు.

పవన్ కల్యాణ్ వ్యాఖ్యల్లో నిజమెంత, సినిమా ఫంక్షన్లో పవన్ రాజకీయాలు ఎందుకు మాట్లాడారు అనే విషయాన్ని పక్కనపెడితే.. పవన్ పార్టీతో ఇటీవల టీడీపీ సఖ్యతగా ఉంటోంది. పరిషత్ ఎన్నికల్లో కూడా కొన్నిచోట్ల రెండు పార్టీలు ఓ ఒప్పందం ప్రకారం ఎంపీపీ స్థానాల్ని కైవసం చేసుకున్నాయి. ఈ దశలో కనీసం తన మిత్రుడిగా అయినా పవన్ కి టీడీపీ సపోర్ట్ చేయాల్సి ఉంది. అయితే పవన్ వ్యాఖ్యలపై కానీ, ఆయనకు పడిన కౌంటర్లపై కానీ టీడీపీ నుంచి ఎలాంటి స్పందనా లేదు.

పవన్ కల్యాణ్ వ్యాఖ్యల నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీలోనే ఏకాభిప్రాయం లేదని అర్థమవుతోంది. కేవలం హీరోలు నాని, కార్తికేయ మినహా.. ఇంకెవరూ పవన్ కి నేరుగా మద్దతు తెలపలేదు. ఆన్ లైన్ టికెటింగ్ వ్యవహారాన్ని ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకోవడాన్ని నేరుగా వ్యతిరేకించలేదు. అటు ఇండస్ట్రీ పరంగా పవన్ ఏకాకి అయ్యారని ఈ వ్యవహారాన్నిబట్టి తెలుస్తోంది. ఇటు పొలిటికల్ సీన్ లో కూడా మిత్రపక్షం బీజేపీ, పరిషత్ ఎన్నికల్లో మిత్రులుగా మారిన టీడీపీ కూడా పవన్ కి మద్దతుగా బయటకు రాకపోవడం విశేషం. పవన్ పై పడిన కౌంటర్లకు సోషల్ మీడియాలో అభిమానులు మాత్రమే తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. మంత్రుల వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. టీడీపీ, బీజేపీ నుంచి నాయకులెవరూ పవన్ కి మద్దతుగా మీడియా ముందుకు రాలేదు. కనీసం పవన్ ని సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో కూడా స్పందించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: