మరో తుఫాన్ గుబులు
ఆంధ్ర ప్రదేశ్ లోని ఉత్త రాంధ్ర  ప్రాంతాన్ని వణికించి తీరాన్ని దాటిన గులాబ్  తుఫాన్ నుంచి తేరుకోక మందే మరో తుఫాన్ రాష్ట్రంలో అలజడి రేపుతోంది. అయితే ఇది నిజమైన తుఫాన్ కాదండోయ్ ... టీ కప్పులో తుఫాన్.  వివరంగా చెప్పాలంటే  బ్రాహ్మణ సామాజిక వర్గం ఎక్కువగా సేవించే కాఫీ కప్పులో తుఫాన్.
 ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, విడదల చేస్తున్న ఉత్తర్వులు సహజంగా రాష్ట్రంలో చర్చకు దారి తీస్తున్నాయి. కొన్ని కొన్ని ఉత్తర్వుల పై  వివిధ రాజకీయ పార్టీలు కోర్టుల దాకా వెళుతున్నాయి. ఇలాంటి వివాదమే తాజా గా  ఆంధ్ర ప్రదేశ్ లో చర్చ జరుగుతోంది.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల చాలా కార్పోరేషన్ లను ఏర్పాటు చేసింది. వాటికి పాలక మండళ్లను కూడా నియమించింది. వివిధ కులాల అభివృద్ధికి సదరు కార్పోరేషన్ లు ఉపయోగ పడతాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిే వీటి ఏర్పాటు సందర్భంగా పేర్కొన్నారు.  అంతవరకూ బాగానే ఉంది .  వీటికి సంబంధించి  ప్రభుత్వం తాజాగా 103 జివోను విడదల చేసింది. ఈ ఉత్తర్వు వివాదాస్పదమైంది. బ్రాహ్మణ కార్పోరేషన్ ను తీసుకు వెళ్లి   బి.సి. కార్పోరేషన్ పరిధి లోకి చేర్చారు. దీనిపై రెండు వర్గాలలోనూ అభ్యంతరాలు వెల్లు వెత్తాయి.  బ్రాహ్మణ, బి.సి నేతలు ఎవరి పరిధిలో వారు తమకు తెలిసిన వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ నేతల వద్దకు వెళ్లి తమగోడు వెళ్లబోసుకున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని అభ్యర్థించారు.
వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా విమర్శించేందుకు  సిద్దంగా ఉన్న తెలుగు దేశం పార్టీ నేతలు  వెంటనే మీడియా ముందు ప్రత్యక్షమయ్యారు. ముఖ్యమంత్రి పనితీరు పై విమర్శల వర్షం గుప్పించారు. బ్రాహ్మణ కార్పోరేషన్ మాజీ చైర్మన్ ఆనంద్ సూర్య ఆంధ్ర  ప్రదేశ్ ముఖ్యమంత్రి వ్యవహార శైలిపై  విరుచుకు పడ్డారు. మాయ మాటలు చెప్పి బ్రాహ్మణుల ఓట్లు వేయించుకున్నారని, ఆ తరువాత మాట తప్పారని విమర్శించారు.  ఎన్నికల ముందు బ్రాహ్మణ కార్పోరేషన్ కు వెయ్యి కోట్లు ఇస్తామన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మాట తప్పారని అన్నారు. కులాల మధ్య గొడవలు సృష్టించడం ముఖ్యమం్రతి  స్థాయి వ్యక్తికి తగదన్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని ప్రకటించారు. కులాల మధ్య  గొడవలు సృష్టించే విధంగా ఉన్న జీ.వో 103 ని రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ  బి.సి. నేత, తిరుపతి పార్లమెంట్ జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య యాదవ్  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వివాదం పెద్దది కావడంతో ఆంధ్ర ప్రదేశ్ ఉప సభాపతి కోన రఘపతి రంగ ప్రవేశం చేసి చర్చకు పుల్ స్టాప్ పెట్టే యత్నం చేశారు. 103 జీవో తో బ్రాహ్మణ సమాజిక వర్గానికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. నవ రత్నాల పథకం ద్వారానే బ్రాహ్మణ లభ్ది దారులకు సంక్షేమ పథకాలు అందుతాయయని చెప్పారు. ఒకరి కి కేటాయించిన నిధులు, మరోకరికి ఇవ్వడం ఉండదని అన్నారు. పాలనా పరమైన సౌలభ్యం కోసమే 103 జీవో వచ్చిందని ఉప సభాపతి వివరించారు. బ్రాహ్మణ కార్పోరేషన్ పై రాజకీయాలు చేయడం తగదని ఆయన హితవు పలికారు.  కాగా ఈ వివాదం ఇంకా ముగిసి పోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: