ఏపీలో జిల్లాల విభజన జరగనుందా? అంటే ఈ ప్రక్రియ ఎప్పటినుంచో నడుస్తుందనే సంగతి తెలిసిందే. 13 జిల్లాలు కాస్త 26 జిల్లాలు అవుతాయని వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చర్చ నడుస్తోంది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్ళు దాటేసింది. ఇంతవరకు జిల్లాల ప్రక్రియ ఏమైందో ఎవరికీ తెలియదు. కానీ ఈ మధ్య వైసీపీ నేతలు సడన్ షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే 100 శాతం మంది మంత్రులని పక్కనబెట్టేసి కొత్తవారికి అవకాశం కల్పించడానికి సి‌ఎం జగన్ సిద్ధమయ్యారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక బాంబ్ పేల్చారు.

ఇక డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తాజాగా మరో ట్విస్ట్ ఇచ్చారు. జనగణన కొనసాగుతుండడంతో కొత్త జిల్లాల ఏర్పాటులో కొంత జాప్యం జరుగుతోందని, వచ్చే సాధారణ బడ్జెట్‌ లోపే రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుందని మాట్లాడారు. అంటే వచ్చే వేసవి కాలంలోపు జిల్లాలు ఏర్పాటు అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే దీని వల్ల ప్రజల్లో ఎలాంటి అసంతృప్తి చెలరేగుతుందో అర్ధం కాకుండా ఉంది.

ఎందుకంటే ఇప్పటికే మూడు రాజధానుల పేరిట రాష్ట్రానికి సరిగ్గా ఒక రాజధాని లేకుండా చేశారని ప్రజల్లో అసంతృప్తి ఉంది. ఉన్న రాజధాని కాదని, మూడు రాజధానులని ఏర్పాటు చేయాలని జగన్ చూశారు. కానీ ఇంతవరకు మూడు రాజధానుల ప్రక్రియ జరగలేదు. ఇప్పటికే రెండున్నర ఏళ్ళు అయ్యాయి. మరో రెండేళ్లలో ఎన్నికల ప్రక్రియ మొదలైపోతుంది. మరి ఈలోపు మూడు రాజధానులు ఎప్పటికీ అవుతాయో తెలియకుండా ఉంది. ఒకవేళ మూడు రాజధానులు వచ్చినా ప్రజలకు పెద్దగా ఉపయోగ పడేలా కనిపించడం లేదు.

పైగా ఈ మూడు రాజధానుల కాన్సెప్ట్ వల్ల ప్రాంతాల మధ్య కాస్త అంతరం వస్తుంది. ఇక జిల్లాల విభజన జరిగితే ఇంకేం రచ్చ జరుగుతుందో అర్ధం కాకుండా ఉందని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా ఏపీలో పాల‌న అంతా అస్తవ్య‌స్తంగా జ‌రుగుతుంద‌న్న విమ‌ర్శ‌లే ఎక్కువుగా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: