ఏపీలో ప్ర‌తిప‌క్షంలో ఉన్న తెలుగు దేశం పార్టీకి వ‌రుస‌గా కొద్ది రోజులుగా ఏదో ఒక ఇబ్బంది క‌లుగుతూనే ఉంది. వ‌రుస‌గా నేత‌లు తాము ఇక‌పై రాజ‌కీయాల్లో కొన‌సాగ‌లేమని చెప్ప‌డ‌మో లేదా అస్త్ర సన్యాసం చేస్తున్నారు. కొంద‌రు నేత‌లు అయితే తాము వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోమని చంద్రబాబుకు నేరుగానే చెబుతున్న ప‌రిస్థితి ఉంది. విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని చంద్రబాబుకు తాను వ‌చ్చే ఎన్నిక‌ల‌లో పోటీ చేయ‌న‌ని చెప్పడంతో పెద్ద క‌ల‌క‌లం రేగింది. ఇక ఇప్పుడు మరికొందరు నేతలు కూడా పోటీకి దూరమవుతున్న‌ట్టు తెలుస్తోంది. సీనియ‌ర్ పార్ల‌మెంటేరియ‌న్‌, గుంటూరు, న‌రసారావుపేట మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సయితం తాను పోటీకి దూరమని ప్రకటించ‌డంతో పాటు ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల లో త‌న కుటుంబ స‌భ్యులు ఇద్ద‌రికి టిక్కెట్లు ఇవ్వాల‌ని చంద్ర‌బాబును కోరిన‌ట్టు చెప్పారు.

ఇక రాయ‌ల‌సీమ‌కు చెందిన కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశరెడ్డి కూడా వయసు పరంగా, ఆరోగ్యపరంగా సమస్యలు తలెత్తడంతో రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నార‌ట‌. అయితే ఆయ‌న మాత్రం తన సతీమణి కోట్ల సుజాతమ్మను మాత్రం ఆలూరులో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించాల‌ని చూస్తున్నార‌ట‌. ఇక ఛాన్స్ ఉంటే త‌న కుమారుడు రాఘ‌వేంద‌ర్ రెడ్డిని క‌ర్నూలు పార్ల‌మెంటు బ‌రిలోకి దింపాల‌ని కూడా ఆయ‌న చూస్తున్నారు.

ఇప్ప‌టికే రెండు సార్లు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల‌లోనూ పోటీ చేసి హ్యాట్రిక్ పరాభావాన్ని మూటకట్టుకోవడానికి సిద్ధంగా లేరట‌. ఇక అదే సీమ‌లోని అనంత‌పురం జిల్లాకు చెందిన సీనియ‌ర్ నేత‌, హిందూపురం పార్లమెంటు నియోజకవర్గం మాజీ సభ్యుడు నిమ్మల కిష్టప్ప సయితం పోటీకి దూరంగా ఉండాలని డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తోంది. కుదిరితే పుట్టపర్తి, పెనుకొండ అసెంబ్లీల నుంచి తాను పోటీ చేయాలని ఆయన ప్లాన్లు వేసుకుంటున్నారు. మ‌రి ఆయ‌న ప్ర‌య‌త్నాలు ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తాయో ?  చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp