ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్న నేప‌థ్యంలో అవసరాలను తీర్చేందుకు భారతదేశానికి అతి పెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సరిపోయే పరిమాణంలో కనీసం నాలుగు లేదా ఐదు బ్యాంకుల‌ను ఏర్పాటు చేయాల్సిన‌ అవసరముంద‌ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఆర్థిక వ్యవస్థ లో కొత్త, మారుతున్న మరియు పెరుగుతున్న అవసరాలను తీర్చడానికి మహమ్మారికి ముందుగానే బ్యాంకులను విలీనం చేశామ‌ని చెప్పారు.  ఆదివారం ఇండియన్ బ్యాంకుల అసోసియేషన్ వార్షిక సమావేశంలో  సీతారామన్ చెప్పారు.


   ఆర్థిక వ్యవస్థ పూర్తిగా వేరొక స్థాయికి చేరుతోంద‌ని,  క‌రోనా మ‌హమ్మారికి ముందు చేసిన బ్యాంకుల‌ విలీనం ద్వారా భార‌త‌దేశ చోద‌క శ‌క్తి పెరిగింద‌ని తెలిపారు.  ఇంకా ఇలాంటి పెద్ద బ్యాంకుల అవ‌స‌రం ఉంద‌ని  అని సీతారామన్ పేర్కొన్నారు. ఎస్‌బీఐ లాంటి మ‌రో మూడు లేదా నాలుగు బ్యాంకులు ఏర్పాటు అవ‌స‌రం ఉంద‌ని వివ‌రించారు. ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల విలీనం ద్వారా పెద్ద బ్యాంకులను తీసుకురావ‌డానికి అవ‌కాశం ఉంటుంద‌ని పేర్కొన్నారు.


   2019లో బ‌ల‌హీనంగా ఉన్న ఆరు ప్ర‌భుత్వం రంగ బ్యాంకుల‌ను విలీనం చేయ‌డం వ‌ల్ల 4 పెద్ద బ్యాంకులు ఏర్ప‌డ్డాయ‌న్న‌ది తెలిసిన విష‌య‌మే.  ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం, 2030 నాటికి 2 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల ఎగుమ‌తుల ల‌క్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని మంచి వ్యాపార న‌మునాల‌ను అభివృద్ధి చేయాల‌ని బ్యాంకుల‌కు సూచించారు మంత్రి నిర్మ‌ల‌. మౌళిక రంగాన్ని ప్రోత్స‌హించేందుకు ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో ఒక సంస్థ‌ను ఏర్పాటు చేస్తామ‌ని, దానికి సంబంధించిన విధి విధానాలు రూపొందిస్తామ‌ని ఈ సంద‌ర్భంగా ఆమె ప్ర‌క‌టించారు.


   క‌రోనా సమయంలో ఖాతాదారులకు అసౌకర్యం కలిగించకుండా విజయవంతంగా విలీనం చేసిన బ్యాంకులను సీతారామన్ ప్రశంసించారు, అయితే బ్యాంకుల అంతర్గత వ్యవస్థలు క్రమం తప్పకుండా ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేయగలగాలి అని అన్నారు. దేశంలో చాలా ప్రాంతాల్లో బ్యాంకుల‌ను ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. బ్యాంకు శాఖ‌లు ఏర్పాటు చేయ‌లేని ప్రాంతాల్లో డిజిట‌ల్ విధానంలో బ్యాంకింగ్ సేవ‌లు అందించ‌డానికి అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: