రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సొంత పార్టీలో సీనియర్ నేతల నుంచి నానా తంటాలు పడుతున్నాడు. పార్టీని బలోపేతం చేయాలనే ప్రయత్నాలు ఓవైపు, సభలు, సమావేశాల బిజీ మరోవైపు. ఇలా ఇంటా బయట తలనొప్పులతో సతమతమవుతున్నారు రేవంత్ రెడ్డి. రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పై విరుచుకు పడిన వైనం తో కాంగ్రెస్ ఎప్పటికీ బాగుపడదు అన్నమాట అందరి నోటి నుంచి వచ్చింది. ఆశ్చర్యకరంగా రెండోరోజు  కే భిన్నమైన వాదనలను వినిపించిన జగ్గారెడ్డి రేవంత్ కు సారీ చెప్పడమే కాదు తాను ఇకపై మీడియాకు దూరంగా ఉంటానని పేర్కొన్నారు. తాను మాట్లాడిన మాటలకు చెంపలేసుకున్నంత పని చేసిన జగ్గారెడ్డి ఎపిసోడ్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

రేవంత్ చేపడుతున్న కార్యక్రమాలు చేస్తున్న ఆందోళనలు అధికార పక్షానికి నివేదికలు అందుతున్న వేళలో సొంత పార్టీ నేతలే అందుకు భిన్నంగా వ్యవహరించడాన్ని సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ జగ్గారెడ్డికి తలంటు పోసిందని సీరియస్ హెచ్చరికలు చేసిందనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి తాజా ఎపిసోడ్తో జగ్గారెడ్డి ఎపిసోడ్ ఓ కొలిక్కి వచ్చిందన్నంతలో నిత్య అసమ్మతి నేత కోమటిరెడ్డి గళం విప్పారు. ఇటీవలికాలంలో పార్టీ కార్యక్రమాల్లో అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నట్టుగా ఆయన తీరు తరచూ హాట్ టాపిక్ గా వినిపిస్తోంది. పి సి సి చీప్, కమిటీ నియామకం తర్వాత నుంచి పార్టీకి ఒకింత దూరంగా ఉంటున్న ఆయన అప్పుడప్పుడు మీడియా ముందుకొచ్చి విమర్శలు గుప్పించడం ద్వారా తన ఉనికిని చాటుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన తన నియోజకవర్గంలోని ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలకు మాత్రం హాజరవుతున్నారు. ఏ మాత్రం అవకాశం చిక్కిన  తనకు నచ్చని రాష్ట్ర పార్టీ నాయకత్వంపై విరుచుకు పడుతున్న ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా  తాను పార్టీ కార్యక్రమాలకు, దూరంగా ఉంటున్నారన్న విషయాన్ని చెప్పు కు వచ్చారు. తన షో రాజకీయాలు తెలియవని  అన్నారు. రెండేళ్లలో ఎన్నికలు వస్తుంటే  ఇదేనా పార్టీ సన్నద్ధత అంటూ అన్నారు. ఈ కారణంతోనే తను పార్టీ పొలిటికల్ అఫైర్స్ మీటింగ్ కు వెళ్లలేదంటూ అన్నారు. సీనియర్లను సంప్రదించకుండా,అధికార ప్రతినిధుల ని  నియమిస్తారా అన్న ప్రశ్నను సంధించిన ఆయన వచ్చేవారం రాహుల్, ప్రియాంక ల ను కలిసినప్పుడు ఈ విషయాలన్నీ  చర్చిస్తానన్నాడు.

హుజురాబాద్ ఖాళీ అయి  నాలుగున్నర నెలలు అయింది అని కొత్త పిసిసి వచ్చి మూడున్నర నెలల అయినప్పటికీ ప్రధాన ప్రతిపక్షం ఎందుకు రివ్యూ చేయట్లేదన్న ఆయన హుజురాబాద్ కు పిసిసి నేతలు ఎందుకు వెళ్లరని ప్రశ్నించారు. పార్టీ లో అసలేం జరుగుతుందో అర్థం కావట్లేదు అన్నారు. హుజురాబాద్ లో ఫైట్ జరుగుతుంటే కాంగ్రెస్ దాన్ని వదిలేస్తే అర్థం ఏంటి అన్న ప్రశ్నను సంధించారు. హుజురాబాద్ యుద్ధానికి ముందే చేతులెత్తేసారా అన్న ఆయన అందుకే నియోజకవర్గానికి తాను పార్టీ కార్యక్రమాలకి  దూరంగా ఉన్నాన న్నారు. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తే నే గెలుస్తుందన్నారు. పార్టీ గెలుపు సంగతి తర్వాత ఇలా అసమ్మతి వ్యాఖ్యలతో పార్టీకి జరిగే నష్టం మాటేమిటన్న ప్రశ్నను పలువురు ప్రశ్నిస్తున్నారు. జగ్గారెడ్డి ని సెట్ చేసిన అధినాయకత్వం కోమటిరెడ్డి  విషయంలోనూ అంతే వేగంగా రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి. దీన్ని ఇలాగే వదిలేస్తే పార్టీకే నష్టం అని అంటున్నారు పలువురు నేతలు.

మరింత సమాచారం తెలుసుకోండి: