ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాల నేపధ్యంలో సిఎం వైఎస్ జగన్ అలెర్ట్ అయ్యారు. గులాబ్‌ తుపాను, అనంతర పరిస్ధితులపై సీఎం సమీక్ష నిర్వహించారు. గులాబ్‌ తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా క్యాంప్‌ కార్యాలయం నుంచి సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష జరిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ లు నిర్వహించారు ఆయన. వీరితో పాటు విజయనగరం నుంచి సమీక్షలో మంత్రి బొత్స సత్యన్నారాయణ, విశాఖ నుంచి మంత్రి అవంతి శ్రీనివాస్ సమీక్షకు హాజరు అయ్యారు.

విపత్తు నిర్వహణ కమిషనర్‌ కన్నబాబు, శ్రీకాకుళం నుంచి వీసీలో డిప్యూటీ సీఎం ధర్మాన  కృష్ణదాస్, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ పాల్గొన్నారు. ముఖ్యమంత్రికి తుఫాను అనంతర పరిస్థితులను వివరించిన సీఎస్‌ ఆదిత్య నాథ్‌ దాస్‌... కొన్ని ప్రాంతాల్లో మాత్రమే 80–90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి అని తెలిపారు. మిగలిన చోట్ల అంత తీవ్రత లేదు అని అన్నారు. జాతీయ రహదారితో పాటు ప్రధాన మార్గాల్లో రవాణాకు ఎక్కడా ఆటంకం లేదు అని జగన్ కు తెలిపారు. ఆధికారులు అంతా క్షేత్రస్దాయిలో ఉన్నారు అని ఆయన పేర్కొన్నారు.

అవసరమైన చోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాం అన్నారు ఆయన. విశాఖ నగరంలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రాంతంలో సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేశాం అని వివరించారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాం అని వివరించారు. ఇక తుఫాన్ ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లు, అధికార్లకు సీఎం సూచనలు సలహాలు ఇచ్చారు. వర్షం తగ్గుముఖం పట్టగానే యుద్ధ ప్రాతిపదికన విద్యుత్‌ను పునరుద్ధరించాలి అని అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. అవసరమైన అన్నిచోట్లా సహాయక, పునరావాస శిబిరాలను తెరవాలని సిఎం సూచించారు. ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బంది పడుతున్న కుటుంబాలను ఆదుకోవాలన్న సీఎం... సహాయ శిబిరాలనుంచి బాధితులు వెళ్లేటప్పుడు కుటుంబానికి రూ.1000 చొప్పున ఇవ్వాలని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: