వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలాంటి తప్పు చేసినా... అధినేత సీరియస్ అయిపోతారు. ఏ చిన్న తప్పు జరగకుండా చూసుకోవాలని ఇప్పటికే ఎన్నోసార్లు స్పష్టం చేశారు కూడా. ఇక గీత దాడిన నేతలపై కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెనుకాడడు. విశాఖలో భూ కబ్జా ఆరోపణలు వచ్చాయని తెలిసి సొంత పార్టీ నేతను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేశాడు కూడా ఇక ఎవరైనా అంతర్గత కుమ్ములాటలకు దిగితే... వారిపై చర్యలు తీసుకుంటారు కూడా. ముందు మర్యాదగా చెప్పి చూడటం... లేదంటే సీరియస్ యాక్షన్ తీసుకోవడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నైజం. గతంలో కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ పార్టీలో చేరిన సమయంలో నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు... కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న జగన్... గుడివాడ నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదిర్చారు.

ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యే మధ్య వివాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలు హద్దులు మీరి ఒకరిపై ఒకరు ఘాటు వ్యాఖ్యలు చేసుకున్నారు. అసలు వైసీపీ విధానాలకే విరుద్ధంగా వ్యవహరించారు. నువ్వేంత అంటే నువ్వెంత అంటూ విమర్శల వర్షం కురిపించుకున్నారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న వైఎస్ జగన్... అసలు విషయం ఏమిటో తేల్చాలంటూ ఉభయ గోదావరి జిల్లాల పార్టీ ఇంఛార్జ్, తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అప్పగించారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే పూర్తిస్థాయి నివేదిక తెప్పించుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్... ఇద్దరు నేతలను అర్జెంట్‌గా కలవాలని ఆర్డర్ వేశారు. మంగళవారం తాడేపల్లి వచ్చి... తనను కలవాలని ఆదేశించేశారు జగన్. గతంలో నుంచే ఇద్దరి మధ్య వివాదం ఉన్నప్పటికీ... వైవీ సుబ్బారెడ్డి వల్ల కాస్త సద్దుమణిగింది. అయితే ఇప్పుడు మరోసారి ఈ వివాదం రేగడం... పార్టీ పరువు పోయినట్లుగా జగన్ భావించారు. ఈ వ్యవహారాన్ని ఇలాగే వదిలేస్తే... పార్టీలో మరికొందరు నేతలు కూడా ఇదే తీరుగా వ్యవహరించే ప్రమాదం ఉందని... అలాంటి వారిని కట్టడి చేయాలంటే... గట్టి వార్నింగ్ తప్పనిసరి అనేది జగన్ ఆలోచన. సో.. ఈ ఎపిసోడ్‌లో జగన్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో అనేది హాట్ టాపిక్‌గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: