జగన్ ఏపీలో మరి కొద్ది నెలలలో చేయబోయే రాజకీయ ప్రయోగం గురించి ఇపుడు అంతటా చర్చగా ఉంది. జగన్ వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తగినట్లుగా పార్టీని, ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోవడానికి చూస్తున్నారు. జగన్ ఆలోచనలు ఎవరి ఊహకు ఇప్పటికైతే అందేలా కనిపించడంలేదు.


అయితే జగన్ బంధువు, సీనియర్ మంత్రి అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి మాటలను కనుక గమనంలోకి తీసుకుంటే జగన్ నూటికి నూరు శాతం మంత్రులను తొలగించి కొత్తవారికి చోటిస్తారు అని అంటున్నారు. అదే కనుక జరిగితే జగన్ చేసే అతి పెద్ద‌ సాహసం అదే అవుతుంది అంటున్నారు. నిజానికి ఇది విఫల ప్రయోగంగా ఏపీ చరిత్రలో ఉంది. ఉమ్మడి ఏపీకి సీఎం గా ఎన్టీయార్ ఉన్న రోజులలో అంటే 1989 ప్రాంతంలో మొత్తం మంత్రులను ఒక్క వేటుతో తొలగించారు. అంతే కాదు చాలా మంది మంత్రులను పూర్తిగా కొత్తవారిని తీసుకుని ఎన్టీయార్ నాడు ఎన్నికలకు వెళ్లారు. 1989 డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నాడు ఘోరంగా ఓడిపోయింది.


ఇపుడు చూస్తే జగన్ మళ్ళీ అదే ప్రయోగం చేయబోతున్నారా అన్న డౌట్లు అందరిలో కలుగుతున్నాయి. మొత్తానికి మొత్తం మంత్రులను తప్పిస్తే అది కచ్చితంగా పార్టీకి చేటు తెచ్చేదే కానీ మేలు చేసేది కాదు అంటున్నారు. తప్పించే మంత్రులలో సీనియర్లు ఉన్నారు. పోనీ వీరి స్థానంలో కొత్తగా మంత్రులను తీసుకున్నా పాతిక మందికి మించి ఇచ్చే అవకాశం లేదు. మరి 150 మంది ఎమ్మెల్యేలలో ఇలా చూసుకున్నా రెండు మంత్రివర్గాలతో  కలుపుకుని యాభై మందికి మించి మంత్రులు కారు. అలాంటపుడు మిగిలిన వంద మంది మాటేంటి. అలాగే మాజీలు అయిన సీనియర్లు ఊరుకుంటారా. ఇక అవకాశం రాని సీనియర్ నేతలు అసంతృప్తి చెందితే అది మొదటికే మోసం వస్తుంది అని అంటున్నారు. మరి జగన్ ఇంతటి దుస్సాహసానికి పాల్పడతారా అన్నది వేచి చూడాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: