ఏంటో ఈ మధ్య తెలంగాణ రాజకీయాల్లో టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అందరికీ టార్గెట్ అయిపోతున్నారు. రేవంత్ ఏమో కే‌సిఆర్ టార్గెట్‌గా ముందుకెళుతుంటే, మిగతా వాళ్లెమో రేవంత్‌ని టార్గెట్ చేస్తున్నారు. అంటే రేవంత్ బలమైన నాయకుడు అని టార్గెట్ చేస్తున్నారా? లేక ఆయన్ని ఎలాగైనా దెబ్బకొట్టాలని చూస్తున్నారా? అనే అంశంపై క్లారిటీ రావడం లేదు. కానీ తెలంగాణలో కే‌సి‌ఆర్‌కు ప్రత్యామ్నాయం రేవంత్ అనే తెలుస్తోంది. అందుకే అందరూ రేవంత్ టార్గెట్‌గానే రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆఖరికి సొంత కాంగ్రెస్ నేతలే రేవంత్‌పై విమర్శలు చేస్తున్నారు.

ఒకో కోణంలో ఒకో విధంగా ప్రత్యర్ధులు రేవంత్‌ని టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. టి‌ఆర్‌ఎస్ నేతలు ఎలాగో రేవంత్‌పై ఎప్పుడూ విరుచుకుపడతారు. ఎందుకంటే రేవంత్ టార్గెట్ టి‌ఆర్‌ఎస్ కాబట్టి. పైగా రేవంత్ చంద్రబాబు మనిషి అని, ఆయన చెప్పినట్లే నడుచుకుంటున్నారని మళ్ళీ ఆంధ్రా, తెలంగాణ అనే బేధాలు తీసుకొచ్చి టి‌ఆర్‌ఎస్ లబ్ది పొందేందుకు చూస్తుంది. ఇదే అంశాన్ని సొంత పార్టీలో కొందరు నేతలు హైలైట్ చేస్తున్నారు.

అటు బి‌జే‌పి కూడా రేవంత్‌ని గట్టిగానే టార్గెట్ చేసింది. కే‌సి‌ఆర్ చెప్పినట్లే రేవంత్ చేస్తున్నారని, టి‌ఆర్‌ఎస్-కాంగ్రెస్‌లు ఒక్కటే అని విమర్శలు చేస్తున్నారు. వారికి తగిన విధంగానే రేవంత్ కూడా కౌంటర్లు ఇచ్చేస్తున్నారు. ఇక ఇటు వస్తే కొత్తగా తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టిన షర్మిల సైతం, రేవంత్‌నే టార్గెట్ చేశారు.

తాజాగా రేవంత్‌కు సంబంధించిన ఓటుకు నోటు కేసుని తీసుకొచ్చి విమర్శించారు. ఆ కేసు ఉండటం వల్ల రేవంత్ పిలక కే‌సి‌ఆర్ చేతుల్లో ఉందని మాట్లాడారు. పిలకే కాదు అవసరమైనప్పుడు మెడ కూడా కే‌సి‌ఆర్ లేకుండా చేస్తారని అన్నారు. అంటే ఇక్కడ షర్మిల...రేవంత్ సైతం కే‌సి‌ఆర్ మనిషి అనే విధంగా చెప్పి, టి‌ఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాదనే విధంగా చెప్పాలని చూసినట్లు తెలుస్తోంది. అసలు ఇంతకు రేవంత్.. చంద్రబాబు మనిషా...లేక కే‌సి‌ఆర్ మనిషా..ప్రత్యర్ధులు ఎలా కావాలంటే అలా రేవంత్‌ని వాడేసుకుంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: