విశాఖలో ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణ గురించి రాజకీయ, సామాన్య వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ జోరుగా జరుగుతోంది. ఆయన రాజకీయాల్లో ఉన్నారా.. అంటే ఉన్నారు! లేరా.. అంటే లేరు! అని సెటైర్లు కూడా వినిపిస్తున్నాయి. నిజానికి అధికార పార్టీ పరంగా నిర్వహించే కార్యక్రమాలకు వైసీపీ ఎంపీ ఎంవీవీని పిలిస్తే వస్తారు.. హాజరవుతారు.. మాట్లాడతారు.. వెళ్లిపోతారు.. అంతేకానీ, విపక్షాల మీద పనికట్టుకుని విమర్శలు చేసిన దాఖలాలు లేవు. అలాగని పార్టీ ఆదేశిస్తే మాత్రం ఎవరి మీదనైనా ఆయన మండిపడతారు. అంతే తప్ప స్వతహాగా మాత్రం స్పందించరు.. అని చర్చ జరుగుతోంది.

గ‌తంలో ఎంవీవీ సత్యన్నారాయణ నిర్మాణ రంగంలో ఉన్నప్పుడు ఆయనపై అనేక ఆరోప‌ణ‌లు తలెత్తాయి. అయితే ఇప్పుడు ఎంపీగా, అందులోనూ అధికార పార్టీలో ఉన్న ఆయ‌న‌పై ప్రతిప‌క్షం ఎందుకు సైలెంట్‌గా ఉంది? అనే అనుమానం క‌లుగుతోంది. వాస్తవానికి ఎంపీ ఎంవీవీ స‌త్యన్నారాయ‌ణ‌.. రాజ‌కీయాలు, వ్యక్తిగ‌త ప‌రిచయాలు వేర్వేరు అనే లేయ‌ర్‌ను ఫాలో అవుతున్నారట. అందువ‌ల‌్ల ఆయ‌నపై విప‌క్షాలు విమ‌ర్శలు చేయ‌డం లేద‌ట. గతంలో ఎంవీవీ బిల్డర్‌గా ఎలా ఉన్నారో, ఎంపీ అయ్యాక కూడా అలాగే ఉన్నార‌నీ, పెద్దగా వ్యత్యాసం లేద‌నీ చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

మ‌రోవైపు ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణ గ‌తంలో బీజేపీ ఎంపీగా ఉంటూ, గ‌వ‌ర్నర్‌గా నియ‌మితులైన కంభంపాటి హరిబాబును ఫాలో అవుతున్నార‌ట. "మ‌నం మ‌న పని చేసుకుపోవాలి, వివాదాలకు పోకూడ‌ద‌ు, ఉన్నమా.. లేమా.. అన్నట్లుగా  ఉండాలి" అని హరిబాబు చేసిన సూచ‌న‌లను ఎంవీవీ ఫాలో అవుతున్నార‌ట. ఇదిలావుంటే, ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎంవీవీని గ‌ట్టిగా వాడేశారని టాక్. ఎర‌క్కపోయి వ‌చ్చి రాజ‌కీయాల్లో ఇరుక్కున్నా.. ఇది భ‌విష్యత్ కాదు అనే విష‌యాన్ని కూడా గ‌మ‌నించేశారట. దీంతో నిర్మాణ రంగాన్ని స్పీడప్‌ చేశారట. నాడు ఎన్నికల్లో జరిగిన న‌ష్టాన్ని భర్తీ చేసుకుంటున్నారని భోగట్టా.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణ అంశాన్ని చాలా లైట్‌గా తీసుకున్నారని ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణపై కార్మిక వ‌ర్గం తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఏదో మొక్కుబడి మాటలు, పరామర్శలు, మాటలు తప్పితే.. చిత్తశుద్ధితో ఏదీ చేయ‌డం లేదని ఆ వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. అయితే తాను మాత్రం ఏ క్షణంలోనైనా రాజీనామా చేయ‌డానికి సిద్ధమనీ, అదేమీ అంత పెద్ద ప‌ని కాద‌నీ, అయితే గ‌ళం విప్పాలంటే.. ఢిల్లీలో మ‌నం ఉండాలనీ చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారన్న విమర్శలు బాహాటంగా వ్యక్తమవుతున్నాయి. మొత్తంమీద విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణపై.. అసలు ఆయన ఉన్నారో, లేదో అనే సెటైర్లు మాత్రం ఎక్కువగా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: