రిపబ్లికి సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ వేదికగా మొదలైన మాటల యుద్ధం... ఇప్పుడు నెమ్మదిగా రాజకీయ రంగు పులుముకుంది. సినిమా పరిశ్రమపై పెత్తనం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్. వకీల్ సాబ్ సినిమాలో తాను హీరో కాకపోతే... ఆ సినిమా విడుదలకు, టికెట్ ధరలకు, బెనిఫిట్ షోలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చేవి కావన్నారు. అలాగే ఆన్ లైన్ విధానంలో టికెట్లను ప్రభుత్వమే విక్రయించడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. సినిమా పరిశ్రమ జోలికి వస్తే.. కాలిపోతారంటూ వార్నింగ్ ఇచ్చారు కూడా. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నో కేసులను పక్కన పెట్టేసి,... సినీ పరిశ్రమపైనే ఎందుకు స్పెషల్ ఫోకస్ పెట్టారో చెప్పాలన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆరోపించారు.

పవన్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు... ఎదురుదాడి చేశారు. తెలుగు సినీ పరిశ్రమకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ఎంతో మేలు చేస్తుందని చెప్పుకొచ్చారు. కావాలంటే... లవ్ స్టోరీ సినిమా కలెక్షన్లు చూసుకోవాలని కూడా సూచించారు. అదే సమయంలో కులం ప్రస్తావన తీసుకువచ్చారు. రెండు నియోజకవర్గాల్లో ఓడిన వ్యక్తి... తమపై కామెంట్లు చేయడం ఏమిటనీ ఎద్దేవా చేశారు. దీనిపై జనసేనాని పవన్ ఘాటుగా స్పందించారు. వైసీపీ నేతలను కుక్కలతో పోలుస్తూ ట్విట్ చేశారు. తుమ్మెదల ఝంకారాలు, నెమళ్ళ క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు, వైసీపీ గ్రామ సింహాల గోంకారాలు సహజమే అంటూ పవన్ ట్వీట్ చేశారు. దీనికి వైసీపీ మంత్రి పేర్ని నాని కూడా ధీటుగానే బదులిచ్చారు. జనం ఛీత్కారాలు, ఓటర్ల తిరస్కారాలు, తమరి వైవాహిక సంస్కారాలు, వరహ సమానులకు నమస్కారాలు అంటూ నాని ట్విట్ చేశారు. వైసీపీ నేతలను పవన్ కుక్కలతో పోలిస్తే... పవన్‌ పందితో సమానమన్నారు పేర్ని నాని. చూడాలి ఈ ట్విట్ వార్ ఎంత దూరం వెళ్తుందో మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: