దళితబంధు తరహాలో త్వరలో తెలంగాణలో మైనార్టీ బంధు అనే పథకం కూడా తెరపైకి వస్తుందా..? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే అది నిజమేనని అనిపిస్తోంది. అంతే కాదు, అతి త్వరలోనే దానికి సంబంధించిన కార్యాచరణ మొదలయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. హుజూరాబాద్ ఉపఎన్నికలకోసమే దళితబంధు పథకాన్ని ప్రభుత్వం ప్రకటించిందన్న విమర్శల నేపథ్యంలో ఇప్పుడు మైనార్టీబంధుని కూడా తెరపైకి తెచ్చేందుకు కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఎంఐఎం డిమాండ్ నేపథ్యంలో..
దళితబంధు తరహాలో మైనార్టీలకు కూడా మైనార్టీ బంధు అనే పథకాన్ని అమలులోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. ఇటీవల ముస్లింల ఆర్థిక స్థితిగతులపై ఏర్పాటు చేసిన సుధీర్ కమిటీ నివేదికను ఈ సందర్భంగా ఉటంకించారాయన. తెలంగాణ రాష్ట్రంలో 8లక్షల 80వేలమంది ముస్లింలు ఉన్నారని చెప్పిన ఒవైసీ, వారిలో ఒకశాంత మంది తీవ్ర దుర్భర పరిస్థితుల్లో ఉన్నారని, వారికి ఆర్థిక సాయం చేసి ఆదుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. దళితబంధు లాగే.. ముస్లిం కుటుంబాలకు కూడా రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామన్నారు.

మైనార్టీబంధు కోసం 880కోట్ల రూపాయలు..
ఒవైసీ చెప్పిన లెక్కల ప్రకారం మైనార్టీ బంధు పథకాన్ని అమలు చేయాలంటే రూ.880కోట్లు అవసరం అంటే ఇది తెలంగాణ బడ్జెట్ లో కేవలం 0.8శాతం మాత్రమే. ప్రస్తుతానికి ఇది ఎంఐఎం డిమాండ్ గానే వినిపిస్తున్నా.. కేసీఆర్ వ్యూహం కూడా ఇందులో ఉందని అంటున్నారు. మైనార్టీ బంధు పథకానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని, ఇలా ఎంఐఎం తరపున డిమాండ్ వినపడేలా చేస్తున్నారనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ముందుగా మిగతా బడుగు బలహీన వర్గాలకు కూడా ఆర్థిక సాయం అందించాలని ప్రతిపక్షాలు డిమాండ్  చేస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఈ పథకం పట్టాలెక్కే అవకాశం లేకపోయినా.. వచ్చే ఎన్నికల నాటికి క్రమంగా అన్ని వర్గాల వారికి ఆర్థిక సాయం అందించేందుకు కేసీఆర్ వ్యూహ రచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలను ఎదుర్కోడానికి ఈ ఆర్థిక సాయాన్ని ప్రధాన అస్త్రంగా ఆయన మలచుకునే అవకాశముంది.

మరింత సమాచారం తెలుసుకోండి: