తెలంగాణ‌లో బీజేపీ రోజురోజుకు దూకుడు పెంచుకుంటూ పోతోంది. రాష్ట్ర రాజ‌కీయాల్లో అస‌లు బీజేపీ ఉందా అనే సంద‌ర్భం నుంచి ఇప్పుడు టీఆర్ఎస్‌కు ప్ర‌త్నామ్నాయం అని చెప్పుకునే స్థాయికి బీజేపీ అనూహ్యంగా గ‌త కొన్నెండ్లుగా ఎదుగుతూ వ‌స్తోంది. ఈ క్ర‌మంలో కొత్త కొత్త రాజ‌కీయ వ్యూహాల‌ను అమ‌లు చేస్తోంది. అటు కేంద్ర ప్ర‌భుత్వం స‌పోర్ట్‌తో రాష్ట్రంలో దూసుకుపోవాల‌ని చూస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌జా సంగ్రామ యాత్ర పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పాద‌యాత్ర చేప‌ట్టారు. 


ఈ క్ర‌మంలో తెలంగాణ బీజేపీ మ‌రో స‌రికొత్త ప్లాన్ వేస్తోంది. ఎన్నిక‌ల‌కు  రెండు సంవ‌త్స‌రాల ముందే కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌డానికి సిద్ద‌మ‌యిన‌ట్టుగా తెలుస్తోంది.    అయితే, అధిష్టానం ఈ ప్లాన్‌కు ప‌చ్చ‌జెండా ఊప‌గానే వ్యూహం అమలు చేయ‌డానికి రెడీ అవుతోంది. అయితే, ఈ ప్లాన్ ఏ మేర‌కు స‌క్సెస్ అవుతుంద‌నేది స‌ర్వ‌త్రా ఆస‌క్తి క‌లిగిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేప‌ట్ట‌డ‌మే ల‌క్ష్యంగా బీజేపీ నేత‌లు పావులు క‌దుపుతున్నారు. దీనికి అధిష్టానం కూడా స‌పోర్ట్ ఇవ్వ‌డంతో ముందుకు దూసుకెళ్తున్నారు. 


ఇప్ప‌టికే బండి సంజ‌య్ పాద‌యాత్ర‌తో ప్ర‌జ‌ల్లోకి వెళ్లారు. త్వ‌ర‌లోనే తొలి విడ‌త పాద‌యాత్ర ముగిసే లోపే కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. రాబోయే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీల కంటే ముందే ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు 5 విడ‌త‌లుగా పాద‌యాత్ర‌కు ప్లాన్ చేసుకున్నారు బండి సంజ‌య్‌.  ప్ర‌జాసంగ్రామ యాత్ర ముగింపు స‌భ‌లోనే 20 అసెంబ్లీ స్థానాల్లో అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేలా కాషాయ నేత‌లు ప్లాన్ చేస్తున్నార‌ని స‌మాచారం. 


 పాద‌యాత్ర విజ‌య‌వంతానికి కృషి చేసిన వారికి గుర్తింపుగా ఎన్నిక‌ల‌ను రెండు సంవ‌త్స‌రాలు స‌మ‌యం ఉండ‌గానే త‌మ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేందుకు ప్ర‌ణాళిక వేస్తున్నార‌ట బండి.  అయితే, దీనిపై ఇంకా అధిష్టానం నుంచి అనుమ‌తి రాలేద‌ని తెలుస్తోంది. బీజేపీ అధిష్టానం ఓకే చెబితే ప్లాన్ అమ‌లుకు రాష్ట్ర నాయ‌కులు ముందుకు సాగుతార‌ని తెలుస్తోంది. మ‌రి ఏ మేర‌కు క‌మ‌ల‌నాథుల ప్లాన్ వ‌ర్కౌట్ అవుతుందో లేదో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp