తిరుమల వెంక‌న్న‌ దర్శనం పేరుతో ఓ సంస్థ చేస్తున్న మోసం బయటపడింది. తమిళులు పురాట‌సి మాసం పవిత్ర‌మైన‌ది. ఈ మాసంలో శ్రీనివాసుడి వీఐపీ బ్రేక్‌ దర్శనం కల్పిస్తామంటూ సోషల్‌ మీడియాలో ప్రకటన ఇచ్చింది ఓ సంస్థ‌. చెన్నైకి చెందిన ఆ సంస్థ.. రూ.1,11,116 ప్యాకేజీలో చెన్నైబెంగళూరు, కోయంబత్తూరు నుంచి తిరుపతికి రానూపోనూ ప్రయాణ సౌకర్యం, ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో బసతో పాటు తిరుమల, తిరుచానూరులో వీఐపీ బ్రేక్‌ దర్శనం కల్పిస్తామని ఈ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. సోష‌ల్ మీడియాలో వ‌చ్చిన ఈ ప్రకటనపై సీరియస్‌గా స్పందించింది టీటీడీ.


   ఈ ప్రకటన జారీ చేసిన‌ యాత్ర, టూర్స్ సంస్థపై చర్యలు తీసుకోనున్నట్లు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పేర్కొంది. వీఐపీ బ్రేక్‌ టికెట్లను ప్రొటోకాల్‌ పరిధిలోని ప్రముఖులకు, వారు సిఫార్సు చేసే వారికి మాత్రమే కేటాయిస్తు వ‌స్తోంది టీటీడీ. అయితే, ఇలాంటి ప్రకటనలను నమ్మవద్దని భ‌క్తుల‌కు విజ్ఞ‌ప్తి చేసింది. భక్తులను మోసగిస్తున్న ఈ టూర్స్ అండ్ ట్రావెల్స్‌ సంస్థ పై న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించింది టీటీడీ పాల‌క‌వ‌ర్గం.


  అలాగే, మరోవైపు వెంక‌న్న‌ దర్శనం కల్పిస్తామని కొందరు దళారులు టీటీడీ చైర్మ‌న్  వైవీ సుబ్బారెడ్డి పేరు చెబుతూ.. మోసాలు చేస్తున్నారు. సుపథం మార్గంలో దర్శనం కల్పిస్తామని.. భువనగిరికి చెందిన భక్తులకు ఆశ చూపి రూ.300 ప్రత్యేక దర్శనం టోకెన్లు ఇప్పిస్తామని  ఆశ చూపించి మోసానికి పాల్ప‌డుతున్నారు.  కొందరు దళారులు టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి సిఫార్సు లేఖ ఇప్పిస్తామని చెప్పి భక్తులకు ఎస్ఎంఎస్ లు పంపించారు. వారి నుంచి రూ.8 వేలు తీసుకొని ఈ మెసేజ్‌లు పంపినట్లు   బాధితులు పేర్కొన్నారు.


  ఈ మెసేజ్‌లతో టీటీడీ ఛైర్మన్‌ కార్యాలయానికి వెళ్లారు భ‌క్తులు. కానీ, అవి నకిలీ సిఫార్సులని తెలియ‌డంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు.  పోలీసులు ఈ విష‌యంలో విచారణ చేపట్టి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.  రూ.16 వేల‌తో 11 టికెట్ల కోసం దళారులు ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది.  దళారుల మాయ మాటలు విని భక్తులు మోసపోవద్దని టీటీడీ అధికారులు కోరుతున్నారు.  గతంలో కూడా పలువురు దళారుల్ని అరెస్ట్ చేశారు  పోలీసులు. ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్న భ‌క్తుల‌ను మోసం చేస్తూనే ఉన్నారు మోస‌గాళ్లు.


మరింత సమాచారం తెలుసుకోండి:

ttd