గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి నుంచి వ‌రుస విజ‌యాలుద క్కించుకున్న వైసీపీ కీల‌క నాయ‌కుడు, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడుగా గుర్తింపు పొందిన‌.. ఆళ్ల రామ‌కృష్నారెడ్డిని ఈ సారి మంత్రి వ‌ర్గంలోకి తీసుకుంటున్నారా?  తీసుకోక‌పోతే.. ఏం చేస్తారు?  ఇదీ.. ఇప్పుడు మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోని కూడ‌ళ్లు, టీ స్టాళ్ల ద‌గ్గ‌ర జోరుగా సాగుతున్న చ‌ర్చ‌. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలోనే.. చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్‌పై గెలిచిన ఆళ్ల‌కు వైసీపీ అధినేత‌గా జ‌గ‌న్.. మంత్రివ‌ర్గంలో చోటు క‌ల్పిస్తాన‌ని హామీ ఇచ్చారు. దీని ప్ర‌కారం.. ఆయ‌న‌కు గ‌త మంత్రివ‌ర్గంలోనే చోటు క‌ల్పించాల్సి ఉంది. అయితే.. రెడ్డి వ‌ర్గం పెరిగిపోయిన ద‌రిమిలా.. ఈ ప్ర‌తిపాద‌న‌ను జ‌గ‌న్ ప‌క్క‌న పెట్టారు.

దీనికితోడు.. జ‌గ‌న్ వినూత్నంగా దేశంలో ఎక్క‌డా లేని విధంగా మంత్రివ‌ర్గంలోనూ సోష‌ల్ ఇంజ‌నీరింగ్‌ను పాటించారు. ప‌లితంగా.. ఆళ్ల స‌హా అనేక మంది రెడ్డి నేత‌ల‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌లేదు. ఈ క్ర‌మంలో సీఆర్ డీఏ పేరు మార్చి ఏపీ ఎంఆర్‌డీఏ చేసిన త‌ర్వాత‌.. దీనికి చైర్మ‌న్ చేస్తార‌ని.. ప్ర‌చారం జ‌రిగింది. అయితే.. ఈ ప్ర‌తిపాద‌న కూడా ముందుకు సాగ‌లేదు. దీంతో కొంత అస‌హ‌నం వ్య‌క్తం చేసిన ఆళ్ల చాన్నాళ్లు పార్టీకిదూరంగా.. నియోజక‌వ‌ర్గానికి దూరంగా  గ‌డిపారు. కానీ, ఇంత‌లో ఏం జ‌రిగిందో తెలియ‌దు కానీ.. ఆయ‌న మ‌ళ్లీ రాజ‌ధానిలో కేసుల‌తో వెలుగులోకి వ‌చ్చారు.

ఇప్పుడు మ‌రోసారి జ‌గ‌న్ త‌న మంత్రి వ‌ర్గాన్ని  విస్త‌రిస్తున్నార‌ని.. అది కూడా 100 శాతం మారుస్తున్నార‌ని.. తెలియ‌డంతో ఈ ద‌ఫాత‌మ నాయ‌కుడికి మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని.. చాలా మంది ఆశ‌లు పెట్టుకున్నారు. మంగ‌ళ‌గిరిలో అయితే.. కొంద‌రు బెట్టింగులు కూడా క‌ట్టిన‌ట్టు తెలిసింది. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న స‌మాచారం బ‌ట్టి.. రెడ్డి సామాజిక వ‌ర్గం ఇద్ద‌రిని మంత్రివ‌ర్గంలోకి తీసుకునే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. అయితే.. అది సీమ నుంచి ఎదురు చూస్తున్న గ‌డికోట శ్రీకాంత్‌రెడ్డికి.. ద‌క్కుతుంద‌ని.. మ‌రొక‌టి వేరేవారికి ఇస్తార‌ని అంటున్నారు.

అయితే.. దీనిపై క్లారిటీ లేక‌పోవ‌డం.. ఆళ్ల జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడు కావ‌డంతో.. ఆయ‌న‌కే ద‌క్కుతుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే.. రెండోది కూడా సీమ‌కే ఇచ్చే ఛాన్స్ ఉంద‌ని చెబుతున్నారు. క‌ర్నూలును న్యాయ రాజ‌ధానిని చేయాల‌ని అనుకుంటున్న నేప‌థ్యంలో ఈ జిల్లా నుంచి ఒక‌రిని తీసుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఏదేమైనా.. ఆళ్ల‌కు ఈ ద‌ఫా కూడా ఛాన్స్ ద‌క్క‌క పోవ‌చ్చ‌ని మెజారిటీ వైసీపీ నేత‌ల అభిప్రాయంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: