యువ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధాకృష్ణ మ‌రోసారి చ‌ర్చ‌ల్లోకి వ‌చ్చారు. ఆయ‌న ఏ పార్టీలో ఉంటారు?  ఏ పార్టీలోకి వెళ్తారు..? అనే చ‌ర్చ మ‌రోసారి రాజ‌కీయ వ‌ర్గా్ల‌లో ఊపందుకుంది. దీనికి కార‌ణం.. తాజాగా ఆయ‌న గుడివాడ ఎమ్మెల్యే మంత్రి కొడాలి నానితో రెండు గంట‌ల పాటు భేటీ కావ‌డం.. అది కూడా వైసీపీకి చెందిన నాయ‌కుడి ఫంక్ష‌న్‌కు హాజ‌రుకావ‌డ‌మే. వాస్త‌వానికి కొన్నిరోజులుగా రాధా.. గుడివాడ‌లో ప‌ర్య‌టిస్తున్నార‌ని.. ఆయ‌న చంద్ర‌బాబు ఆదేశాల మేర‌కు అక్క‌డ‌కు వెళ్లార‌ని.. వ‌చ్చే ఎన్నికల్లో ఇక్క‌డ నుంచి పోటీ చేయ‌నున్నార‌ని.. అందుకే కాపుల‌ను కూడా స‌మాయ‌త్తం చేస్తున్నార‌ని.. పెద్ద ఎత్తున చ‌ర్చ సాగింది. దాదాపు మూడు వారాల పాటు.. రాదా కూడా గుడివాడ‌లో ప‌ర్య‌టించ‌డం ఈ చ‌ర్చ‌కు ద‌న్నుగా మారింది.

అయితే.. దీనిపై క్లారిటీ రాక‌ముందే.. ఇంత‌లోనే నానిని క‌ల‌వడం.. వీరిద్ద‌రూ రెండు గంట‌ల‌పాటు చ‌ర్చించ‌డం.. అది కూడా రాధా భ‌విత‌వ్యానికి సంబంధించిన చ‌ర్చే సాగ‌డం.. వంటివి రాధా మ‌ళ్లీ వైసీపీ తీర్థం పుచ్చుకుంటారా? అనే చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు వైసీపీలో ఉన్న రాధా.. విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం టికెట్ విష‌యంలో త‌లెత్తిన వివాదంతో పార్టీకి దూర‌మ‌య్యారు. అంతేకాదు.. జ‌గ‌న్‌ను సీఎంను కాకుండా అడ్డుకుంటాన‌ని.. మ‌ళ్లీ చంద్ర‌బాబును సీఎం చేసే వ‌ర‌కు నిద్ర పోన‌ని ప్ర‌తిజ్ఞ‌లు చేశారు. ఈక్ర‌మంలో త‌న త‌ల్లి ర‌త్న‌కుమారితో క‌లిసి య‌జ్ఞాలు, యాగాలు కూడా చేశారు. అయితే.. ప్ర‌భుత్వం రాలేదు. అయిన‌ప్ప‌టికీ.. టీడీపీలోనే కొన‌సాగారు. అమ‌రావ‌తి రాజ‌ధాని విష‌యంలోనూ ఏపీ స‌ర్కారుకు వ్య‌తిరేకంగానే గ‌ళం వినిపించారు.

రాజ‌ధాని ఉద్య‌మంలోనూ పాల్గొన్నారు. అయితే.. టీడీపీలో ఆశించిన విధంగా గుర్తింపు ల‌భించ‌లేదు. చంద్ర‌బాబు అనేక పార్టీ క‌మిటీల‌ను వేసినా.. రాధాకు ఎందులోనూ చోటు క‌ల్పించ‌లేదు. అంతేకాదు.. పార్టీలో ఆయ‌న‌కు ఎక్క‌డా చిన్న స్థానం క‌ల్పించ‌లేదు. ఇది ప్ర‌ధానంగా రాధా వ‌ర్గానికి ఇబ్బందిగా మారింది. మరోవైపు విజ‌య‌వాడ టీడీపీలో ఆధిప‌త్య పోరు.. ప‌రాకాష్ఠ‌కు చేరింది. నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త లోపించింది. పైగా త‌న‌కు ఎక్క‌డ సీటు కేటాయించేందీ చంద్ర‌బాబు స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. అంతేకాదు.. విజ‌య‌వాడ‌లో సీట్లు కూడా ఖాళీగా లేవు. సెంట్ర‌ల్ నుంచి మ‌ళ్లీ బొండా ఉమానే పోటీ చేస్తున్నారు.

ఇక‌, తూర్పులో
గ‌ద్దె రామ్మోహ‌న్‌కే అవ‌కాశం ఉంది. మిగిలింది ప‌శ్చిమ ఇక్క‌డ‌కు వెళ్లేందుకు రాధా అంగీక‌రించ‌డం లేదు. సో.. ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు నుంచి ఆద‌ర‌ణ క‌నిపించ‌క‌పోవ‌డం.. మ‌రోవైపు.. నాని నుంచి ఒత్తిడి పెర‌గ‌డం వంటి కార‌ణాల నేప‌థ్యంలోనే ఆయ‌న తిరిగి వైసీపీ గూటికి వ‌స్తార‌ని అంటున్నారు. ఇలా వ‌చ్చినా.. ఆయ‌న‌కు ఎమ్మెల్యే టికెట్‌పై భ‌రోసా మాత్రం ఎవ‌రూ ఇవ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. కుదిరితే.. ఎమ్మెల్సీ ఇచ్చి.. ఆయ‌న‌ను పార్టీలోకి తీసుకుంటారు అనేది నాని నుంచి వ‌చ్చిన భ‌రోసా.. మొత్తానికి మ‌ళ్లీ రాధా రాజ‌కీయం వైసీపీ వైపు మ‌ళ్లుతుందా?  లేక ఆయ‌న టీడీపీలోనే కొన‌సాగుతారా? అనేది వేచి చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: