తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే ఖాళీగా ఉన్న నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణలో హుజురాబాద్ నియోజకవర్గానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బద్వేల్ నియోజకవర్గానికి ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే నెల ఒకటవ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తుంది కేంద్ర ఎన్నికల కమిషన్. అక్టోబర్ 30వ తేదీన ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత రెండు రోజులకు నవంబర్ 2వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అదే రోజు సాయంత్రం ఫలితాలు ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. దేశంలోని మొత్తం 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. అక్టోబర్ 8వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అక్టోబర్ 13వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ.

తెలుగు రాష్ట్రాల్లో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలోని హుజురాబాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బద్వేల్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. హుజురాబాద్‌లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక బద్వేల్ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య ఆకస్మిక మరణంతో బై పోల్ నిర్వహిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. హుజురాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ తరఫున శ్రీనివాస్ పోటీ చేయనుండగా... బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అలాగే బద్వేల్ నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీ తరఫున గతంలో వెంకట సుబ్బయ్యపై పోటీ చేసి ఓడిన రాజశేఖర్ మరోసారి ఎన్నికల బరిలో నిలుచున్నారు. వైసీపీ తరఫున వెంకట సుబ్బయ్య భార్య సుధాను పోటీలో నిలిపేందుకు ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఎన్నిక ఏదైనా గెలుపు వైసీపీదే అంటున్నారు ఆ పార్టీ నేతలు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలే తమను గెలిపిస్తుందంటున్నారు టీడీపీ నేతలు.


మరింత సమాచారం తెలుసుకోండి: