ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికి సరిగ్గా రెండేళ్ల 5 నెలలు నిండుతోంది. తొలి శాసనసభా పక్ష సమావేశంలోనే పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎమ్మెల్యేలు అంతా ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదే సమావేశంలో జగన్ కూడా ఓ ప్రకటన చేసేశారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికీ పదవులు దక్కుతాయన్నారు. ఇక మంత్రి  పదవులు దక్కించుకున్న వారి రెండున్నర ఏళ్లు మాత్రమే ఉంటారని... ఆ తర్వాత సెకండ్ హాఫ్ వేరే వారికి అవకాశం కల్పిస్తామన్నారు. చెప్పినట్లుగానే ఇప్పుడు మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై దృష్టి పెట్టారు జగన్. కొత్తగా మంత్రులను ఎంపిక చేసేందుకు ఎవరు అర్హులు అనే విషయంపై ముఖ్య నేతలతో చర్చలు కూడా జరుపుతున్నారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

వచ్చే నెలలో మంత్రివర్గ కూర్పు ఉంటుందని ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సమాచారం అందుతోంది. ఇందుకోసం ఆశావహులు అంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు కూడా. మంత్రి వర్గంలో ప్రస్తుతం ఉన్న వారిలో 90 శాతం మందిని తప్పించాలని జగన్ భావిస్తున్నారు. ఇదే విషయాన్ని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్వయంగా ప్రకటించారు కూడా. కొత్తగా ఏర్పాటు చేసే టీమ్‌ను ఎలక్షన్ టీమ్ అని అంతా అనుకుంటున్నారు. దీంతో కొత్త కూర్పుపై ఎంతోమంది ఆశలు పెట్టుకున్నారు. సాధారణంగా మంత్రివర్గంలో స్థానం కోసం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పైరవీలు చేస్తుంటారు. కానీ జగన్ మాత్రం ఎంపీలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై పార్టీకి చెందిన లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో ముందుగా సమావేశం నిర్వహించి... వారి అభిప్రాయం తీసుకోవాలని జగన్ భావిస్తున్నారు. ఈ నెల 29వ తేదీ నుంచి 3 రోజుల పాటు పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులతో చర్చలు జరిగే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపే నేతలకు మంత్రి వర్గంలో స్థానం కల్పించాలనేది జగన్ భావన. సో ఎవరికి అవకాశం వస్తుందో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: