తాజాగా క‌డ‌ప జిల్లా బ‌ద్వేల్ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక‌కు షెడ్యూల్ విడులైంది. దీనికి సంబంధించిన రాజ‌కీయ‌మూ అప్పుడే స్టార్ట‌యింది. సీఎం జ‌గ‌న్ సొంత జిల్లాలోని ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం అయిన‌.. బ‌ద్వేల్‌లో విజ‌యం సాధించాల‌నేది టీడీపీ వ్యూహం. త‌ద్వారా.. వైసీపీని ఇరుకున పెట్టి.. రాష్ట్రంలో ప‌ట్టు పెంచుకునేందుకు వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకుంది. అయితే.. అదేస‌మ‌యంలో వైసీపీ మాత్రం బ‌ద్వేల్‌లో దివంగ‌త వెంక‌ట‌సుబ్బ‌య్య స‌తీమ‌ణి దాస‌రి సుధ‌కు టికెట్ ఇచ్చేందుకు రెడీ అయింది. దీనికి సంబంధించి అప్పుడే ప్ర‌క‌ట‌న కూడా చేసింది. అయితే.. ఈ క్ర‌మంలోనే వైసీపీ నాయ‌కుడు, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు.. స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్య‌లు.. సంచ‌ల‌నంగా మారాయి. అంతేకాదు.. ప్ర‌తిప‌క్షాల‌కు ఆయుధాలుగా కూడా మారాయి.

ఎన్నిక ఏదైనా.. పార్టీలు త‌మ‌కు న‌చ్చిన వ్య‌క్తిని.. లేదా.. ప్ర‌జ‌ల్లో గెలుస్తార‌నే అంచ‌నా ఉన్న నాయ‌కుడికి అవ‌కాశం ఇస్తుంటాయి. అయితే.. ఇది సాధార‌ణ ఎన్నిక‌ల్లో జ‌రిగే ప్ర‌క్రియ‌. అయితే.. ఎవ‌రైనా ఆక‌స్మికంగా మృతి చెంది ఖాళీ అయిన స్థానంలో జ‌రిగే ఉప ఎన్నిక‌కు మాత్రం ఆయా కుటుంబాలోన్ని అర్హులైన వారికి ఇవ్వ‌డం అనేది సంప్ర‌దాయంగా వ‌స్తోంది. అదేస‌మ‌యంలో ప్ర‌తిప‌క్షాలు.. లేదా.. ఆ సీటు ప్ర‌తిప‌క్షానికి అయితే.. అధికార ప‌క్షం కూడా ఉప ఎన్నిక‌కు దూరంగా ఉండ‌డం అనేది కూడా తెలుగు రాష్ట్రాల్లో సంప్ర‌దాయంగా వ‌స్తోంది. కానీ, ఈ సంప్ర‌దాయం.. కొన్నాళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ త‌ప్పిపోయింది. ఎన్నిక ఏదైనా.. పోటా పోటీ.. గెలుపు ఓట‌ములు.. ఆధిప‌త్య రాజకీయాలుగానే కొన‌సాగుతోంది. అయితే.. తాజాగా స‌జ్జల కొన్ని కామెంట్లు చేశారు.

బ‌ద్వేల్ అభ్య‌ర్థిని ప్ర‌క‌టిస్తూ.. గ‌త ఎన్నిక‌ల్లో గెలిచి ఆకస్మికంగా మృతి చెందిన సుబ్య‌య్య స‌తీమ‌ణి సుధ‌కు టికెట్ ఇస్తున్నామ ని.. ఇది సంప్ర‌దాయ‌మ‌ని.. దీనిని పార్టీ గౌర‌విస్తోంద‌ని చెప్పారు. అదేస‌మ‌యంలో.. ఇలాంటి సంద‌ర్భాల్లో.. ఇత‌ర పార్టీలు పోటీ పెట్ట‌వ‌నే సంప్ర‌దాయం కూడా ఉంద‌ని.. అలాగ‌ని తాము.. పోటీచేయొద్ద‌ని ఎవ‌రినీ కోర‌బోమ‌ని.. ఆయ‌న వ్యాఖ్యానించారు. అయితే.. ఈ సంప్ర‌దాయం పాటించిన‌ట్ట‌యితే.. వైసీపీ.. తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌లో ఎందుకు.. బ‌ల్లి దుర్గాప్ర‌సాద్ కుమారుడికి అవ‌కాశం ఇవ్వ‌లేదు? అనేది ప్ర‌ధానంగా ఇప్పుడు విప‌క్షాల నుంచి వ‌స్తున్న ప్ర‌శ్న‌. అంతేకాదు.. టీడీపీ అంటే భ‌యం ప‌ట్టుకుందా?  లేక‌.. బ‌ద్వేల్‌లోసెంటిమెంటు త‌ప్ప‌.. ప్ర‌భుత్వ ప‌థ‌కాలు ప‌నిచేయ‌వ‌ని.. భావించే అక్క‌డ వెంక‌ట సుబ్బ‌య్య కుటుంబానికి టికెట్ ఇస్తున్నారు? అనే ప్ర‌శ్న‌లు అప్పుడే టీడీపీ నుంచి మొద‌ల‌య్యాయి.

సంప్ర‌దాయం అంటే.. ఒక‌చోట ఉండి.. మ‌రో చోట లేక‌పోవ‌డమా?  లేక‌.. వైసీపీకి క‌ష్టంగా ఉన్న చోట సెంటిమెంటు పాటించి.. తేలిక‌గా గెలుస్తామ‌న్న చోట్ల‌.. వ‌దిలేయ‌డ‌మా? అనేది టీడీపీ సోషల్ మీడియా నుంచి వ‌స్తున్న ప్ర‌శ్న‌. మొత్తానికి స‌జ్జ‌ల నోరు జారి.. వైసీపీని విమ‌ర్శ‌ల‌పాల్జేశార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. నిజానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు సెంటిమెంటు పోయింది. గెలుపు మాత్ర‌మే కీల‌క సూత్రం అన్న విధంగా నాయ‌కులు ముందుకు సాగుతున్నార‌నేది ప్ర‌జ‌లెరిగిన స‌త్య‌మే.. !!

మరింత సమాచారం తెలుసుకోండి: