భారత్ - చైనా మధ్య సరిహద్దు వివాదం రోజు రోజుకూ తారాస్థాయికి చేరుతోంది. తూర్పు లఢక్ ప్రాంతంలో చొరబాట్లతో మొదలైన డ్రాగన్ కంట్రీ దురాక్రమణ... ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్‌ వద్ద ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. కేంద్ర పాలిత ప్రాంతం లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద భారత భూభాగంలోకి తరచూ చొచ్చుకుని వస్తున్నాయి డ్రాగన్ బలగాలు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా మరో కొత్త వివాదానికి చైనా తెర లేపింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుల్లో పెద్ద ఎత్తున గ్రామాలను నిర్మిస్తోంది చైనా. ఇప్పుడు తాజాగా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు వద్ద మరోసారి కలకలం రేపుతోంది. తూర్పు లఢక్ తరహా ఉద్రిక్తతలను అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో కూడా రేపేందుకు కారణమవుతోంది డ్రాగన్ కంట్రీ. సరిహద్దుల్లోని గ్రామాలను ఇప్పటికే తమ దేశ మ్యాప్‌లో చూపించుకుంటోంది చైనా. ఈ అంశంపై ఐక్య రాజ్య సమితిలో కూడా భారత్ ప్రస్తావించింది. అయినా సరే... ఆ భూభాగం మొత్తం కూడా తమదే అని చైనా వాదిస్తోంది.

భారత భూభాగానికి అత్యంత సమీపంలో ఓ గ్రామాన్ని నిర్మిస్తోంది చైనా దేశం. ఆ గ్రామంలో స్థానికులు ఉండేందుకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పిస్తోంది. అలాగే ఆ ప్రాంతంలో భారీగా సైనిక బలగాలను కూడా మొహరిస్తోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే భారత్ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది కూడా. తాజాగా భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించారు. ఈ పర్యటనపై చైనా తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అరుణాచల్ ప్రదేశ్‌లో భారత ఉప రాష్ట్రపతి పర్యచించడం సబబు కాదని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖకు లేఖ కూడా రాసింది చైనా. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలను భారత్ ఉల్లంఘిస్తోందంటూ గగ్గోలు పెట్టింది. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు చేపట్టవద్దంటూ లేఖలో ప్రస్తావించింది. చైనా అభ్యంతరం ఘాటుగా స్పందించిన కేంద్రం... భారత్‌లో పూర్తిగా అంతర్భాగమని లేఖ రాసింది. అక్కడ భారత ప్రముఖులు ఎప్పుడైనా, ఎవరైనా పర్యటించేందుకు అవకాశం ఉందని స్పష్టం చేసింది. భారత ఉప రాష్ట్రపతి అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటిస్తే... మీకు వచ్చిన నష్టం ఏమిటంటూ ఘాటుగా బదులిచ్చారు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి అరిందమ్ బాగ్చీ.

మరింత సమాచారం తెలుసుకోండి: