పవన్ కళ్యాణ్ సినిమాలలో పవర్ స్టార్. అదే పవన్ రాజకీయాల్లో జనసేనాని కూడా. రాజకీయంగా తేల్చుకోవడానికి ఆయన ఎపుడూ రెడీగానే ఉన్నారు. నిజానికి 2019 ఎన్నికల జనసేనకు వేళ చేదు అనుభవాలు ఎదురయ్యాయి. దాంతో జనసేన గమ్యం ఏంటి అన్న సందేహాలు కూడా అందరికీ వచ్చాయి.

అయితే ఇపుడు 2024 వైపు చూస్తూ దూకుడుగా పవన్ అడుగులు వేస్తున్నారు. గెలుపు ఓటములను పక్కన పెడితే ఈ విధంగా దారుణమైన పరాజయం తరువాత కూడా ఒక పార్టీ శక్తినంతా కూడగట్టుకుని ముందుకు సాగడం అంటే మాటలు కాదు, అది ఆశ్చర్యమే అనుకోవాలి. ఇక పవన్ ఈ మధ్య వాస్తవిక దృక్పధంతోనే రాజకీయాలు చేస్తున్నారు. గెలుపు కోసం ఏం చేయాలో అన్నీ సమకూర్చుకుంటున్నారు.

కులాల కురుక్షేత్రంగా ఉన్న ఏపీ కార్యక్షేత్రంలో తానూ అదే  ఆయుధాన్నే పట్టాలని పవన్ నిర్ణయించినపుడే పవన్ రాజకీయ వ్యూహలు ఏంటో తెలిసాయి. ఈ మధ్య రాజమండ్రి సభలో పవన్ కాపులంతా ఒక్కటి కావాలని కోరుకున్నారు. ఇపుడు బీసీ నేతలతో  భేటీ అయ్యారు. 2024 ఎన్నికల్లో రాజ్యాధికారం దక్కని సామాజికవర్గాలకు తాను అండగా ఉంటాను అని కూడా పవన్ చెప్పారు.

మొత్తానికి పవన్ బీసీ మంత్రం మాత్రం ఏపీ రాజకీయ సమీకరణలను మార్చివేస్తుంది అన్న చర్చ అయితే సాగుతోంది. పవన్ కూడా ఏ కులానికి తాను వ్యతిరేకం కాదు అంటూ చేస్తున్న ప్రసంగాలు ఆయనలోని రాజకీయ పరిణతిని చాటిచెబుతున్నాయి. మొత్తానికి బీసీలు ఏపీలో అతి పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారే టీడీపీకి దశాబ్దాలుగా గట్టి ఓటు బ్యాంక్ గా ఉన్నారు. వారే వైసీపీ బంపర్ మెజారిటీ వెనక కూడా ఉన్నారు. అలాంటి బీసీలను మచ్చిక చేసుకుంటే జనసేన రాజకీయ వేగం వేరేలా ఉంటుందన్న విశ్లేషణలు ఉన్నాయి. మొత్తానికి పవన్ పక్కా వ్యూహంతోనే ఏపీ రాజకీయాల్లో ముందుకు సాగుతున్నారు. చూడాలి మరి ఆ ఫలితాలు ఎలా ఉంటాయో.


మరింత సమాచారం తెలుసుకోండి: