ఆంధ్రప్రదేశ్‌లో చీకట్లు కమ్ముకుంటున్నాయా? విద్యుత్‌ సంక్షోభం ముదురుతోందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. వరుస పరిణామాలు, పరిస్థితులు ఆ వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. కొందామన్నా ఎక్ఛేంజిలో విద్యుత్ దొరకడం లేదు. మిగతా థర్మల్ ప్లాంట్లు మూసేసినా ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్న ఏకైక ప్లాంట్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్‌లో ఉత్పాదన సామర్ధ్యం సగానికి సగం పడిపోయింది. కృష్ణపట్నం, రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్లు పునఃప్రారంభం అయినప్పటికీ బొగ్గు కొరతతో ఉత్పాదన నిలిపివేశాయి. డిమాండుకు తగ్గ సరఫరా లేకపోవడంతో విద్యుత్ కోతలు ప్రారంభం అయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో నాలుగు గంటలు విద్యుత్ కోతలు అమలు జరుగుతుండగా రేపోమాపో పట్టణాలకు ఇది విస్తరించనుంది.
వర్షాకాలం ముగియక ముందు, ఇంకా చలికాలం ప్రారంభం కాకముందే పవర్ కట్ ఆరంభం కావడంతో రాష్ట్ర ప్రజలు ఖంగుతింటున్నారు. ఆదివారం గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 10 గంటలలోపు నాలుగు గంటలు పాటు విద్యుత్ కోతలు విధించారు. సాయంత్రం 6 నుంచి 10 గంటల మధ్యలో పీక్ లోడ్ రిలీఫ్ పేరిట రెండు గంటలు పాటు కోత విధించారు.

 
రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గు ముఖం పట్టాక గత ఏడాదికంటే ఈ సంవత్సరం విద్యుత్ డిమాండు పెరిగింది. డిమాండు 190 మిలియన్ యూనిట్లు ఉండగా సరఫరాల 165 మిలియన్ యూనిట్లకు మించి రావడం లేదు. శ్రీశైలం, నాగార్జున సాగర్  ప్రాజెక్టులకు వరద వస్తుండటంతో ఈ రెండు డ్యాములలోని విద్యుత్ ప్లాంట్లను ఆన్ చేశారు. ఈ పవర్ సరఫరా అవుతున్నప్పటికీ పీక్ లోడ్ డిమాండ్‌ను తట్టుకొనేందుకు సాయంత్రం 6 నుంచి 10 గంటలు మధ్య యూనిట్‌ను ఓపెన్ ఎక్ఛేంజిలో 17నుంచి 20 రూపాయలకు కొనుగోలు చేయాల్సి వస్తుందని జెన్‌కో అధికారులు చెబుతున్నారు. కొనుగోలు చేద్దామన్నా విద్యుత్ లభ్యం కావడం లేదని ప్రస్తుత పరిస్ధితుల్లో వినియోగం తగ్గించడం ఒక్కటే ఏకైక పరిష్కార మార్గం అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ప్రజలు సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలని ఆయన ఉచిత సలహా పడేశారు. బొగ్గు కొరత ధరల పెరుగుదల వల్ల డబ్బు వెచ్చించినా సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితి లేదని వివరించారు. విద్యుత్ కోతలు అధికారికంగా రావచ్చు అని ఆయన స్పష్టం చేశారు.

ప్రభుత్వ ప్రధాన సలహాదారుడే విద్యుత్ కోతలు తప్పవని చేతులు ఎత్తేస్తూ ప్రజలను మానసికంగా సిద్ధం చేయడం ప్రారంభించారు. సోలార్ విండ్ పవర్‌లను పీపీఏల పునఃసమీక్షల పేరిట బిల్లులు చెల్లించకుండా మూసి వేయించిన ప్రభుత్వం ఇప్పుడు కోతలు తప్పవని ప్రజలకు చెప్పడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో తెలుగుదేశం అధికారంలో ఉండగా ఐదు సంవత్సరాల పాటు పైసా కూడా ఛార్జీలు పెంచకపోయినప్పటికీ బాదుడే బాదుడు అంటూ ఇంత పెద్ద నోరేసుకొని జగన్ అరిచారని అధికారంలోకి వచ్చాక ట్రూ అప్ చార్జీల పేరిట బాదుడు ప్రారంభించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏకంగా జగన్‌కే బహిరంగ లేఖ రాశారు. విద్యుత్ సంక్షోభం రోజురోజుకు ముదురుతుండటంతో వైసీపీ నేతలు తమ తప్పు ఏమీలేదని కేంద్రమే అంతా చేస్తోందంటూ నెపం నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: