జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ కాపులు ఇతర కులాల రాజ్యాధికారం సాధించాలంటే.. కాపు పెద్దలు ముందుకు రావాలని పిలుపునిచ్చిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా కాపు సంఘాలు, సేనలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నాయి. హరిరామ జోగయ్య లాంటి నేతలు పవన్ వ్యాఖ్యలను సమర్ధించడంతో పాటు ఆయనకు అండగా నిలవాలని పిలుపు నిచ్చారు. ఇదిలాఉంటే,  కాపు సంఘాల నేతలు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని టార్గెట్ చేస్తూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. తాజాగా రావులపాలెంలో కాపు సంఘాల సమావేశంతో పాటు మాజీ మంత్రి హరిరామజోగయ్య ప్రారంభించిన లక్ష ఉత్తరాల ఉద్యయం ఈ కోవకే వస్తుందని కాపు నేతలు అంటున్నారు.

ఇదిలాఉంటే, గత ప్రభుత్వ హయంలో కాపు రిజర్వేషన్లను న్యాయ చిక్కులు రాకుండా షెడ్యూల్ 9లో చేర్చాలని కేంద్రాన్ని అప్పటి చంద్రబాబు సర్కారు కోరిందని, అయితే జగన్ అధికారంలోకి వచ్చాక ఆ ప్రయత్నాన్ని సైతం కోల్డ్ స్టోరేజిలో పెట్టడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు కాపు రిజర్వేషన్లు దయాదాక్షిణ్యాల మీద  కాకుండా జనాభా ప్రాతిపదికన ఇవ్వాలని అంటున్నారు. అలా అయితే 5 శాతం కాకుండా... 10 శాతం వరకూ వస్తాయని కాపు సంక్షేమ సేన ముఖ్యమంత్రిని హెచ్చరిస్తోంది. ఈ మేరకు హరిరామ జోగయ్య ఇప్పటికే మీడియా సమావేశం పెట్టి మరీ అల్టిమేటం కూడా జారీ చేశారు.

ఇదిలాఉంటే, ఇప్పటికే కాపు రిజర్వేషన్లపై మంత్రులు, ఎమ్మెల్యేలు, విపక్షనేతలకు తాము లేఖలు రాశామని ఇక ఓపిక పట్టే పరిస్ధితి ఉండదంటున్నారు. తమకు 175 నియోజకవర్గాల్లో కమిటీలు ఉన్నాయంటున్నా.. వారు ఇప్పటికే  లోకల్ ఎమ్మార్వోను కలసి కాపు రిజర్వేషన్లపై ముఖ్యమంత్రికి లేఖలు అందించామన్నారు. అయితే ముఖ్యమంత్రి నుండి స్పందన లేకపోవడంతో ఇక ఉద్యమమే శరణ్యం అని మరో యుద్దానికి సిధ్దం అవుతున్నామని వారు అంటున్నారు. ముఖ్యమంత్రికి కాపులంటే చిన్నచూపుగా ఉందన్న వారు.. బీసీలకు, ఎస్సీలకు, మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించిన ప్రభుత్వం కాపులను చిన్నచూపు చూస్తోందని జోగయ్య అన్నారు. ఇదే కొనసాగితే పోస్టు కార్టులో పేర్కొన్నట్టు ముఖ్యమంత్రి పీఠం కదులుతుందని అంటున్నారు.

ఇదిలా ఉంటే, ఈ పోస్టు కార్డు ఉద్యమం 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో నెలాఖరు వరకూ నిర్వహిస్తామంటున్నారు. ఏపీలో జనాభా ప్రకారం 24 శాతం కాపులు ఉన్నారనే విషయాన్ని ఈ ప్రభుత్వం గుర్తించాలని కాపు సంక్షేమ సేన రాష్ట్ర సమన్వయకర్త చందూ శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. మొత్తంమీద, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా కాపులు పెద్దన్నపాత్ర పోషించాలి అని పిలుపునిచ్చిన నాటినుండి కాపుసంఘాలు, సేనలు యాక్టివ్ అవుతున్నాయి. అంతటితో ఆగకుండా మధ్యలో ఆపేసిన కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లడంతో పాటు జగన్ సర్కారుకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ముఖ్యమంత్రి ఉదాసీన వైఖరి పట్ల కత్తులు నూరుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: