భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురయ్యారు. మన్మోహన్ సింగ్‌కు ఈ సాయంత్రం తీవ్ర ఛాతి నొప్పి రావడంతో... అత్యవసర చికిత్స కోసం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. జ్వరంతో పాటు తీవ్ర నీరసంతో ఆయన బాధపడుతున్నారని ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా, మాజీ ప్రధానమంత్రిగా రెండు సార్లు పదవి బాధ్యతలు నిర్వహించిన మన్మోహన్ సింగ్ వయసు ప్రస్తుతం 88 సంవత్సరాలు. ఈ ఏడాది ఏప్రిల్ నెల 19వ తేదీన ఆయన కరోనా వైరస్ బారిన పడ్డారు. అప్పుడు దాదాపు 15 రోజుల పాటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. చికిత్స అనంతరం కొలుకున్న మన్మోహన్ సింగ్... నాటి నుంచి పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఎయిమ్స్ ఆసుపత్రిలో డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా ఆధ్వర్యంలోని వైద్య బృందం మన్మోహన్ సింగ్‌కు చికిత్స అందిస్తోంది. రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో మన్మోహన్ బాధపడుతున్నారని వైద్యులు వెల్లడించారు.

మన్మోహన్ సింగ్ రెండు డోసుల కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారని వైద్యులు వెల్లడించారు. వ్యాక్సినేషన్ తర్వాతే ఆయనకు వైరస్ సోకిందని... అందువల్లే ఆయన ప్రాణాపాయం నుంచి తప్పుకున్నారని వైద్యులు అప్పట్లో ప్రకటించారు. మన్మోహన్ సింగ్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలుసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఎయిమ్స్ ఆసుపత్రి చేరుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల నుంచి వివరాలు సేకరించారు. ఆయన కేవలం జనరల్ చెకప్ కోసమే ఎయిమ్స్ ఆసుపత్రికి వచ్చారని కాంగ్రెస్ పార్టీ నేతలు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిమితంగానే ఉందని తెలిపారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు. దయచేసి పుకార్లు పుట్టించవద్దని విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యంపై పూర్తిస్థాయి వివరాలు అందిస్తామన్నారు. గతంలో 2009లో మన్మోహన్ సింగ్‌కు బైపాస్ సర్జరీ జరిగింది. 1990 నుంచి ఛాతి సంబంధిత వ్యాధిలో మన్మోహన్ ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటి వరకు ఆయనకు ఐదు సార్లు స్టంట్లు వేశారు వైద్యులు. ప్రస్తుతం రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్య వహిస్తున్న మన్మోహన్ సింగ్... గతేడాది కూడా ఛాతిలో నొప్పి రావడంతో ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందారు.

మరింత సమాచారం తెలుసుకోండి: