ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ సంక్షోభం తరుముకొస్తోంది. చీకట్లు కమ్ముకొస్తున్నాయి. దీంతో రెండేళ్ల క్రితం వరకు మిగులు విద్యుత్‌ ఉన్న రాష్ట్రంలో.. ఇప్పుడీ సంక్షోభం ఎందుకు వచ్చింది, అసలు కారణం ఏమిటన్న చర్చ జోరుగా జరుగుతోంది. విద్యుత్ రంగంపై దృష్టి సారించకపోవడం, ముందుచూపుతో వ్యవహరించకపోవడం వల్లే ఇప్పుడు ఈ విషయంలో ప్రభుత్వం బొక్క బోర్లా పడింది అనే అభిప్రాయాలు, వాదనలు విద్యుత్‌, రాజకీయ రంగాల నిపుణుల్లో వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో కృష్ణపట్నం, రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్‌లో విద్యుత్ ఉత్పాదనను నిలిపివేసి విజయవాడకు సమీపంలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్‌లో విద్యుత్ ఉత్పాదనను సగానికి సగం తగ్గించేసింది. బొగ్గు కొరత ఏర్పడటం, సోలార్ విండ్ పవర్ సంస్ధలు విద్యుత్ ఉత్పాదనను నిలిపివేయడంతో ఒక్కసారిగా స్వయం కృతాపరాధంతో ఆంధ్రప్రదేశ్‌లో సంక్షోభం ముంచుకొచ్చిందని వారు విశ్లేషిస్తున్నారు.

2014వ సంవత్సరంలో విభజన తర్వాత జూన్ నాటికి ఏపీలో 22.5 మిలియన్లు విద్యుత్ లోటు ఉంది. అప్పట్లో పట్టణాల్లో ఎనిమిది గంటలు, గ్రామాల్లో 12 గంటలు విద్యుత్ కోత అమలయ్యేది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ రంగంపై దృష్టి సారించింది. ఉత్పాదన పెంచుకోవడం, ట్రాన్సమిషన్ నష్టాలు తగ్గించుకోవడం, 24 గంటలు విద్యుత్ సరఫరా ఉండే విధంగా చేయడం, వ్యవసాయానికి  7 గంటలు విద్యుత్ సరఫరా నిరంతరం కొనసాగించడం వంటి లక్ష్యాలతో  టీడీపీ సర్కారు అప్పట్లో ప్రణాళికలు రూపొందించింది. వెంటనే లక్ష్యాలను కూడా చేరుకోగలిగింది. దీంతో అప్పుడు ఏపీలో 24 గంటల పాటు విద్యుత్ సరఫరా సాధ్యం అయింది.

ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్‌ రంగంపై ముందుచూపు లేకుండా వ్యవహరించిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా సౌర పవన విద్యుత్ రంగాలపై అక్కసు పెంచుకుని ఎక్కువ ధరకు 25 సంవత్సరాలు పాటు ఒప్పందాలు కుదుర్చుకుని రాష్ట్రానికి ఆర్ధికంగా నష్టాలు కలిగించారని ఆరోపణలు తలెత్తాయి. పీపీఏలలో పెట్టుబడులు పెట్టిన జపాన్, జర్మనీ వంటి పలు దేశాలు, జపాన్‌కు చెందిన సాఫ్ట్ బ్యాంకు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీ ప్రభుత్వానికి పీపీఏల జోలికి వెళ్లొద్దని హెచ్చరించింది. అయినప్పటికీ మొండి పట్టుదలతో ముందుకు వెళ్లిన జగన్‌ ప్రభుత్వానికి ఇప్పుడు తలబొప్పి కడుతోంది. మొత్తంమీద వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విద్యుత్‌ ప్లాంట్లు పడకేశాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: