ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోకు ప్రాధాన్యత ఇచ్చింది. ఎన్నికల్లో ప్రకటించినట్లుగా రెండు పేజీల మేనిఫెస్టోలో నవరత్నాలను జగన్ సర్కార్ ప్రకటించింది. అందులో అన్నిటి కంటే ప్రధానమైనది అమ్మఒడి ప్రథకం. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో 15 వేల రూపాయలు ఇచ్చేలా అమ్మఒడి పథకాన్ని ఏపీ సర్కార్ రూపొందించింది. ఇప్పటికే రెండు విడతలు ఈ పథకం కింద తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది ప్రభుత్వం. 2020 జనవరి 12న తొలి విడత డబ్బులు జమ చేసింది ప్రభుత్వం. ఆ తర్వాత నుంచి కరోనా వైరస్ రావడంతో... పాఠశాలలు పూర్తిగా మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో హాజరు నిబంధనను పక్కన పెట్టింది జగన్ సర్కార్. హాజరు తప్పనిసరిని పక్కన పెట్టేసి... రెండో విడత డబ్బును ఈ ఏడాది జనవరి 10వ తేదీన ప్రభుత్వం జమ చేసింది. సెకండ్ వేవ్ నేపథ్యంలో... మార్చి నెల రెండో వారం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి పాఠశాలలు మూత పడ్డాయి.

అయితే ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ విస్తృతంగా జరుగుతున్న నేపథ్యంలో... ఈ ఏడాది ఆగస్టు 16వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఆన్ లైన్ క్లాసులను పూర్తిగా రద్దు చేసి... కేవలం ప్రత్యక్ష విధానంలోనే పాఠాలు భోదిస్తున్నారు. ప్రస్తుతం అన్ని పాఠశాలలు పూర్తిస్థాయిలో నడుస్తున్నాయి. పిల్లలంతా బడి బాట పట్టడంతో.... వైఎస్ జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అమ్మఒడి పథకానికి సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అమ్మఒడి పథకం కోసం 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఏడాది నుంచి హాజరు నిబంధన తప్పనిసరిగా ఉండాలని ఇటీవల నిర్వహించిన విద్యాశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. కరోనా కారణంగా తొలగించిన హాజరు నిబంధనను... మళ్లీ అమలు చేయాలని తెలిపారు. ప్రస్తుతం పాఠశాలలు పూర్తిస్థాయిలో జరుగుతున్న నేపథ్యంలో హాజరు నిబంధన తప్పనిసరి చేయాలని సీఎం జగన్ తెలిపారు. వచ్చే ఏడాది నుంచి అకడమిక్ ఇయర్‌తో అమ్మఒడి పథకాన్ని అనుసంధానం చేయాలని కూడా అధికారులకు దిశా నిర్దేశం చేశారు వైఎస్ జగన్.

మరింత సమాచారం తెలుసుకోండి: