తూర్పు గోదావరి జిల్లాలో కమ్మ సామాజికవర్గం హవా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో మండపేట కూడా ఒకటి. ఇక్కడ గత మూడు పర్యాయాల నుంచి కమ్మ వర్గానికి చెందిన వేగుళ్ళ జోగేశ్వరరావు ఎమ్మెల్యేగా విజయం సాధిస్తూ వస్తున్నారు. టి‌డి‌పి తరుపున 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. అయితే ఇలా వరుసగా గెలవడానికి వేగుళ్ళ పనితీరు కూడా ఒక కారణమని చెప్పొచ్చు. వేగుళ్ళ ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉంటారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారు.

టి‌డి‌పి అధికారంలో ఉండగా మండపేటలో మంచిగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అలాగే వేగుళ్ళ వివాదాల జోలికి వెళ్లరు...కులాల ప్రకారం రాజకీయాలు చేయరు. అందుకే వేగుళ్ళని మండపేట ప్రజలు వరుసగా మూడుసార్లు గెలిపించారు. కానీ ఎంత మంచి ఎమ్మెల్యే అయినా ప్రజలకు ఎప్పుడొకప్పుడు బోరు కొడుతుంది. అందుకే అనుకుంటా ఇప్పుడు మండపేట ప్రజల్లో కాస్త మార్పు కనిపిస్తోంది.

పైగా ఇక్కడ వైసీపీ తరుపున తోట త్రిమూర్తులు రంగప్రవేశం చేసిన దగ్గర నుంచి రాజకీయం మారింది. టి‌డి‌పి నుంచి వచ్చిన తోటకు జగన్ మండపేట బాధ్యతలు అప్పగించారు.  తోట ఎంట్రీ తర్వాత ఇక్కడ టి‌డి‌పిలో ఉన్న బలమైన ద్వితీయ శ్రేణి నాయకులని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేశారు. అలాగే పంచాయితీ, మండపేట మున్సిపాలిటీ, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో వైసీపీకి అదిరిపోయే ఫలితాలు వచ్చేలా చేశారు. అందుకే తోటకు జగన్ ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు.


ఇక వచ్చే ఎన్నికల్లో తోట మండపేటలోనే పోటీ చేసే ఛాన్స్ కూడా ఉందని తెలుస్తోంది.  ఎందుకంటే తోట సొంత నియోజకవర్గం రామచంద్రాపురంలో వైసీపీలో ఖాళీ లేదు. అక్కడ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ ఉన్నారు. ఒకవేళ అటు-ఇటు నాయకులని మారిస్తే చెప్పలేం గానీ...చాలా వరకు మండపేటలో తోటనే బరిలో దిగే ఛాన్స్ ఉంది. పైగా మండపేటలో తోట సొంత సామాజికవర్గం కాపు ఓట్లు ఎక్కువే. అయితే వేగుళ్ళని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కమ్మ, శెట్టిబలిజ వర్గాల్లో వేగుళ్ళకు ఫాలోయింగ్ ఉంది. మరి చూడాలి మండపేటలో కమ్మ ఎమ్మెల్యే అయిన వేగుళ్ళకు కాపు నేత తోట చెక్ పెడతారేమో.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp