తెలుగుదేశం పార్టీ  ప్రస్తుతం తీవ్ర గడ్డు పరిస్థితుల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లుగా అయిపోయింది పరిస్థితి. 2014 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ... సరిగ్గా ఐదేళ్ల తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షానికే పరిమితం అయ్యింది. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తెలుగుదేశం పార్టీ.... రాష్ట్రంలో మళ్లీ పుంజుకునేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఇక ఎన్నికలకు సరిగ్గా రెండున్నర ఏళ్ల సమయమే ఉన్న పరిస్థితుల్లో పార్టీని తిరిగి గాడిలో పెట్టేందుకు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారు. 2014 ఎన్నికల తర్వాత పార్టీ అధ్యక్షులుగా తెలుగు రాష్ట్రాలకు వేరు వేరుగా అధ్యక్షులను నియమించారు. తెలంగాణకు ఎల్.రమణను నియమించారు. ఆయన ఏడేళ్ల తర్వాత అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరడంతో మరో బీసీ నేతకే పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు.

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్ష బాధ్యతలను ముందుగా పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావుకు అప్పగించారు చంద్రబాబు. ఎన్నికలు ముగిసిన తర్వాత... అధ్యక్షునిగా కొత్త వ్యక్తిని నియమించారు చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వంతో వేధింపులకు గురైన శ్రీకాకుళం జిల్లాకు చెందిన టెక్కలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు నాయుడు. తొలినాళ్లలో పార్టీని సమర్థంగా నడిపిన అచ్చెన్నాయుడు... ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. అధికార పార్టీ నేతలపై దూకుడుగా వ్యవహరించిన అచ్చెన్న... తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల ప్రచారం సమయంలో నోరు జారారు. పార్టీ అధినేతతో పాటు ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజ్ పెద్ద ఎత్తున వైరల్ కావడంతో... అప్పటి నుంచి అచ్చెన్నాయుడు సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారు. దీంతో ఇప్పుడు కొత్త నేత ఎంపిక కోసం చంద్రబాబు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: