అన్నట్లుగానే ఆమె రీ ఎంట్రీ ఇచ్చింది. ఒకరిద్దరు కాదు వందలాది మంది అనుచరులతో భారీ ర్యాలీగా వచ్చింది. తన బలం, బలగం ఏంటో ప్రత్యర్థులకు చూపించింది. శశికళ రీ ఎంట్రీ తో తమిళనాట రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. జయలలిత సమాధి దగ్గర ఈసారి శపథాలు అయితే చేయలేదు కానీ భావోద్వేగానికి మాత్రం గురైంది. శశికళ సీఎం అవుతాననుకున్న పలని స్వామి, పన్నీర్ సెల్వం అలా కానివ్వలేదు. వీరిద్దరూ కలిసి సీఎం,డిప్యూటీ సీఎం ల పదవులు పంచుకున్నారె గాని ప్రభుత్వాన్ని మాత్రం సమర్థవంతంగా నడవలేక పోయారు. ఈ రాజకీయ శూన్యతను డీఎంకే తనకు అనుకూలంగా మలుచుకుంది. ఇప్పుడు స్టాలిన్ అందరూ మెచ్చిన సీఎంగా  దూసుకెళ్తున్నారు. ఇలాంటి ఈ పరిస్థితుల్లో జయలలిత నెచ్చెలి శశికళ పొలిటికల్ రీ ఎంట్రీ హీట్  పెంచేసింది.

 ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని శశికళ గతంలో ప్రకటించారు. కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నారు. తనను ఏ పార్టీ నుంచి బహిష్కరించారో అదే పార్టీని మళ్ళీ చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు కనిపిస్తోంది. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అన్నీ తానై చక్రం తిప్పింది. శశికళ రీ ఎంట్రీ తో అన్నాడీఎంకే  లో చీలిక ఉంటుందా, లేకపోతే సర్దుకుపోయి ఆమెను తిరిగి పార్టీలోకి ఆహ్వానించే ఆలోచన ఏదైనా పలని, పన్నీరు  మదిలో ఉందా అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న స్టాలిన్ ను ఢీ కొట్టాలంటే బలమైన నాయకత్వం కావాలి. పలని, పన్నీర్ తో పోల్చుకుంటే శశికళ కు కొంత వరకు మాస్ ఇమేజ్ ఉంది. చాలా వరకు పార్టీ క్యాడర్ కూడా ఆమెకు మద్దతుగానే నిలుస్తోంది. మరి మున్ముందు  ఎలాంటి రాజకీయ వ్యూహాలతో శశికళ ముందుకెళ్తారో చూడాలి. అన్నా డిఎంకెలో నాయకత్వ కొరతే ఇప్పుడు ఆ పార్టీకి శాపంగా మారింది. తాజాగా తమిళనాడులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రముఖ సినీ నటుడు విజయ్  అభిమానుల సంఘం దళపతి విజయ్ మక్కల్ ఇయక్కం  సత్తా చాటింది. వచ్చే ఎన్నికల్లో అన్నాడీఎంకే సత్తా చాటాలంటే ముందు ఆ పార్టీకి బలమైన నాయకత్వం కావాలి. మరి శశికళ ఆ స్థానాన్ని భర్తీ చేస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: