ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత... తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు పూర్తిగా పక్కన పెట్టారు. 175 నియోజకవర్గాల్లో కనీసం ఒక్క చోట కూడా హస్తం పార్టీకి డిపాజిట్లు దక్కలేదు. ఇక రాష్ట్ర విభజనకు కారణమైన తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు ప్రతిపక్షానికే పరిమితం అయ్యింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. ఒక దశలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు కూడా అభ్యర్థులు కరువయ్యారు. చివరికి అన్ని స్థానాలకు బదులుగా... కొన్ని చోట్ల మాత్రమే కాంగ్రెస్ పార్టీ బరిలో దిగింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పంచాయతీ ఎన్నికలు, పురపాలక సంఘాల పోరులో కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక్కటంటే ఒక్క స్థానం కూడా దక్కలేదు. కానీ తన ఉనికిని చాటుకునేందుకు మాత్రం తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలు, బద్వేల్ ఉప ఎన్నికల్లో కూడా అభ్యర్థులను బరిలోకి దింపింది హస్తం పార్టీ.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఇప్పుడు పార్టీ ప్రదేశ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా మాజీ మంత్రి సాకే శైలజానాథ్ వ్యవహరిస్తున్నారు. ఏదో అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటీకీ... భవిష్యత్తు మాత్రం పూర్తిగా అగమ్య గోచరంగా మారింది. ఇప్పట్లో పార్టీకి పూర్వ వైభవం వచ్చే అవకాశం కనిపించటం లేదు. ఈ పరిస్థితుల్లో తన భవిష్యత్తు కోసం పీసీసీ అధ్యక్షులు కొత్త బాట పడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో 2014 ఎన్నికల సమయంలోనే తెలుగు దేశం పార్టీలో చేరేందుకు సాకే శైలజానాథ్ తీవ్రంగా ప్రయత్నించారు. అయితే అప్పట్లో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అడ్డుపడ్డారనే పుకార్లు పెద్ద ఎత్తున షికారు చేశాయి. తాజాగా మరోసారి ఏపీసీసీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో రాయభారం కూడా నడిపినట్లు సమాచారం. శైలజానాథ్‌కు తెలుగుదేశం కండువా కప్పేందుకు కూడా చంద్రబాబు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే... సంక్రాంతి నుంచి ఏపీలో రాజకీయాలు మారిపోనున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: