ఆంధ్రప్రదేశ్‌లో అనధికారిక విద్యుత్‌ కోతలు అధికమవుతుండటంతో.. పరిశ్రమల యాజమానులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో ఇప్పటికే గ్రామాల్లో అనధికారికంగా విద్యుత్‌ కోతలు మొదలయ్యాయి. ఇప్పుడు పరిశ్రమలకు కూడా పవర్‌ కట్ తప్పలేదు. అయితే లోడ్‌ రిలీఫ్‌ పేరిట ఎక్కడా విద్యుత్‌ కోతలు విధించడం లేదని ప్రభుత్వం చెబుతోంది. కానీ వినియోగానికి, ఉత్పత్తికి మధ్య ౩౦ మిలియన్‌ యూనిట్ల అంతరం ఉందని లెక్కలు చెబుతున్నాయి. దీంతో కోతలు విధించక తప్పని పరిస్థితి అని అధికార వర్గాలు అంటున్నాయి.

ఏపిలో విద్యుత్‌ డిమాండ్‌ పెరగటం, గత ఏడాదికంటే ఈ డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో.. సాయంత్రం 6 నుంచి 10 గంటల మధ్య ఏసీలు వినియోగించవద్దని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. మరోవైపు థర్మల్‌ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా సరిగా లేకపోవడంతో పూర్తిస్ధాయిలో విద్యుత్‌ ఉత్పాదన జరగడం గలేదు. ఈ కేంద్రాల ఉత్పత్తి సామర్ద్యంలో 50 శాతానికి మించి ఉత్పత్తి కావడం లేదు.  బకాయిలు చెల్లించకపోవడంతో సౌర, పవన విద్యుత్‌ సంస్థలు విద్యుత్‌ ఉత్పాదనను నిలిపివేశాయి. హైడల్‌ కేంద్రాల ద్వారా మాత్రమే పూర్తిస్థాయి విద్యుత్‌ ఉత్పాదన జరుగుతోంది. డిమాండ్‌కు తగిన సరఫరా మాత్రం ఇంకా లేదు. కేంద్రం దగ్గర  ఏ రాష్ర్టం కొనుగోలు చేయకుండా మిగిలిపోయిన విద్యుత్‌లో  400 మెగావాట్లు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. కానీ ఇది ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో స్పష్టం చేయలేదు. బొగ్గు కొనుగోలు కోసం రూ.250 కోట్లు జెన్‌కోకు మంజూరు చేసినట్టు చెబుతున్నా.. పాత బకాయిలను మాత్రం ప్రస్తావించలేదు. బొగ్గు సరఫరా కంపెనీలకు చెల్లించాల్సిన బకాయిలతో నిమిత్తం లేకుండా కొరతతో ఉన్న విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు సరఫరా చేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది. కేంద్ర మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా ఏపీకి బొగ్గు సరఫరా చేయాలని ఉత్పత్తి సంస్థలతో మాట్లాడినట్టు సర్కారు  ప్రకటించింది.

మొత్తంమీద పీక్‌ అవర్స్‌లో లోడ్‌ రిలీఫ్‌ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఫలితంగా రాష్ట్రంలో పరిశ్రమలకు విద్యుత్‌ కోత తప్పదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో పరిశ్రమల యజమానులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల లోపు.. మరో 2 గంటల పాటు కోత విధిస్తున్నారు. రోజుకి మూడు షిఫ్టులు పనిచేసే పరిశ్రమల్లో రెండు షిఫ్టులు మాత్రమే పనిచేసే విధంగా సర్దుబాటు చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: